అతిగా వాడితే..?

చెవి దగ్గర ఎక్కువ సేపు పెట్టుకుని, అదే పనిగా ఫోన్‌ మాట్లాడుతుంటే రేడియేషన్‌ ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరికలు చేస్తుంటారు. దానిని తగ్గించడానికి, కాల్స్‌ మాట్లాడటానికి సులువుగా ఉంటుందని కారణమేదైనా సరే… ఇయర్‌పాడ్స్‌ వాడకం పెరిగింది. ఈ మధ్య ఎవరిని చూసినా చెవుల్లో ఇయర్‌ పాడ్స్‌ పెట్టుకుని కనిపిస్తున్నారు. కొందరికైతే, వారి వారి వృత్తి రీత్యా, అవసరాల రీత్యా వీటి వాడకం తప్పనిసరి అయింది. అయితే వీటి వల్ల చెవి పోటు, చెవి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. వీటి వాడకం ఎలాంటి అనర్థాలు తీసుకొస్తుందో, కొంతమేరైనా నివారించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం…
– ఇయర్‌ ఫోన్‌, ఇయర్‌ పీస్‌, ఇయర్‌ బడ్‌, ఎయిర్‌ ప్యాడ్‌, బ్లూటూత్‌ ఆపరేటింగ్‌… ఇలా పేర్లు ఏవైనా వీటిని కర్ణబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకోవడం వల్ల చెవిలో ఫంగస్‌, బ్యాక్టీరియాలు పేరుకుని దురద, నొప్పి, చెవిలో చీము కారడం, పోటు, చెవిలో జోరుగా వాలుతున్నట్టు గురు మని ఏదో సౌండ్‌ వచ్చినట్టు వివిధ రకాల బాధలు ఎదురవుతాయి.
– ఇయర్‌ ఫోన్లు పెట్టుకోవడంతో చెవిలోకి గాలి దూరే అవకాశం తగ్గిపోతుంది. దీంతో చెవిలో ఫంగస్‌ అతిగా పెరుగుతుంది. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం వివిధ రకాల చెవి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే నాలుగు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది.
– ఇయర్‌ ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తి కోల్పోతాం. సాధారణంగా వయసు రీత్యా ప్రతిఏటా కొంత మేర వినికిడి శక్తిని సహజంగానే కోల్పోతాం. దీనికి పరిష్కారం లేదు. ఇదంతా చాలదన్నట్టు మనం చేతులారా చిన్న వయసులోనే బలవంతంగా వినికిడి కోల్పోయేలా ప్రవర్తిస్తే వైద్యులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఇలా వచ్చే చెవుడుకి చెవిటి మిషన్లు కూడా పనిచేయవు.
– కొన్ని నిమిషాల పాటు ఇయర్‌ ఫోన్స్‌ వాడినప్పుడు వాటిని స్పిరిట్‌ లేదా శానిటైజర్‌తో శానిటైజ్‌ చేయాలి. లేదంటే చెవి బాధలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హెడ్‌ ఫోన్స్‌ వాడటం మొదలుపెట్టి ఎంతకాలమైంది, వాటిని ఎప్పుడైనా క్లీన్‌ చేసినట్టు గుర్తుందా అని ప్రశ్నించుకుంటే మీరు ఎంత ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారో మీకే అర్థమవుతుంది.
– ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు ఏవైనా సరే వాటికి అంతర్గత స్పీకర్లు ఉంటాయి. వాటి ద్వారా వచ్చే సౌండ్‌ సరిపోతుంది. ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని మరీ వినాల్సిన పనిలేదు. ఇయర్‌ ఫోన్లు పెట్టుకోదలిస్తే తక్కువ సౌండ్‌తో వినాలి.
– ఇయర్‌ ఫోన్లు రోజుకు నాలుగు నిమిషాలకు మించి వాడరాదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు మొహమాటానికి పోయి ఎవరికీ మీ ఇయర్‌ ఫోన్లు ఇవ్వకండి. ఇలా ఒకిరిది ఒకరు మార్చుకుంటే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. ఇయర్‌ ఫోన్లు వాడేవారి చెవుల్లో బ్యాక్టీరియా ఏడు రెట్లు ఎక్కువ పెరుగుతుంది. మరి మీరు ఇలా వేరే వారి ఇయర్‌ బడ్స్‌ వాడారో అది మీకు కూడా అంటుకుంటుంది.