తల్లిగా మారడం ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత అందమైన క్షణాలే కాదు, సవాలుతో కూడున్నవి కూడా. గర్భం దాల్చిన తర్వాత స్త్రీ మానసికంగా, శారీరకంగా చాలా మార్పులకు లోనవుతుంది. అందువల్ల పని చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. అవేంటంటే…
పౌష్టికాహారం : తల్లి తన బిడ్డకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం చాలా ముఖ్యం. అందుకే గర్భిణులు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమతుల్యమైన, పోషక విలువలున్నదిగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఆకు కూరలు, తణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇది శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది. అవకాడో, కాలీఫ్లవర్, నారింజ వంటి ఫోలిక్ యాసిడ్ ఆహారాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఉప్పు, పంచదార వంటివి తక్కువ తీసుకోవాలి. మజ్జిగ, తాజా జ్యూస్‌లు మేలు చేస్తాయి.
స్నాక్స్ : ఎక్కువ శాతం మొదటి మూడు నెలలు ఉదయం పూట తలనొప్పి, వికారం సాధారణంగా ఉంటుంది. వికారం తగ్గించడానికి రోజంతా కొద్దికొద్దిగా స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి. లంచ్ బాక్స్‌లో సలాడ్, పండ్లు, బిస్కెట్లు ఉండేలా చూసుకోవాలి.
నడక తప్పనిసరి : పనిలో ఉన్నప్పుడు ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండిపోతుంటారు. ఇది మంచిది కాదు. వెన్ను, కాళ్ళ నొప్పికి కారణమవుతుంది. పిండానికి రక్తప్రసరణ తగ్గి శిశువు ఎదుగుదల మందగిస్తుంది.
ప్రయాణాలకు దూరంగా.. : అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. ఉద్యోగం నిమిత్తం ఎక్కువదూరం ప్రయాణం చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడమో, మరొకరికి బాధ్యత అప్పగించడమో ఉత్తమం. ఒకవేళ ప్రయాణించవలసి వస్తే, కాళ్ళను చాచడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి.
బరువులు ఎత్తవద్దు : గర్భస్త సమయంలో శారీరక శ్రమని ఎంత తగ్గిస్తే అంత ఉపయోగం. లాగడం, నెట్టడం, ఎత్తడం వంటివి అసలు చేయవద్దు. ఇది ప్రమాదకరం.
విరామం తప్పనిసరి : పనిలో ఉన్నప్పుడు చిన్న విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి గంటకు లేచి కొన్ని నిమిషాలు నడవండి. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల కాళ్ళ వాపు కూడా తగ్గుతుంది.
ఉద్యోగం చేసే వారు ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే గర్భస్థ శిశివు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.