చూసీ చూడనట్టు వదిలేస్తుంటే…

If you don't see it...ఈ రోజుల్లో పిల్లల అల్లరిని కంట్రోల్‌ చేయడం తల్లిదండ్రులకు కాస్త కష్టమే. ఒకరిని ఇంకొకరు ఏడిపించుకోవటం మామూలే. చాలా మంది వాటిని చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ అలాంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు ఊరుకోవటం కూడా అంత మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఇలాంటివి పిల్లల మనసు మీద మాత్రమే కాదు, వారి చదువు, నిద్ర, ఆహారం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చుపిస్తాయట. ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలైనా సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
ఇంట్లో ఉండే తోడపుట్టినవారు ఒకరు ఇంకొకరిని అదే పనిగా ఆటపట్టిస్తూ, ప్రతి నిమిషం ఏడిపిస్తూ ఉండటం కనిపిస్తే దానిని కచ్చితంగా దష్టిలో ఉంచుకుని వారిని గమనించాలట. ఎందుకంటే ఏడిపించే పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోయినా వాళ్ళు ఎవరినైతే ఏడిపిస్తున్నారో వారిలో మాత్రం ఎన్నో మార్పులు కనిపిస్తాయట. మన దేశంలో నూటికి 35 శాతం మంది పిల్లలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారట. పేరెంట్స్‌ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇండ్లలో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతోందని పరిశోధకులు గుర్తించారు.
గుర్తించటం ఎలా?
ఇదో పెద్ద సమస్యా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడే పిల్లలు వచ్చి పేరెంట్స్‌తో వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు చూడు అని చెపితే అది అందరి ఇండ్లలో ఉండే గోలగానే చూస్తుంటారు. కాని అదే వాళ్ళకి చెప్పుకోలేని పెద్ద సమస్య. ఇటువంటి సమస్యని ఎదుర్కొనే పిల్లలు సరిగా భోజనం చెయ్యరు, చదువుపై దష్టి పెట్టలేకపోతారు, అందరిలో తొందరగా కలవరు, ఏ విషయానికి వెంటనే స్పందించరు. మొహంలో హావభావాలు చూపించరు. ఏదో కోల్పోయిన వాళ్ళలా దిగాలుగా కూర్చుంటారు. అంతేకాదు ఇంట్లో ఉండే పిల్లలు ఒకరిని ఇంకొకరు కావాలని దూరం చేస్తూ ఉంటారు. ఇలా ఉండే వీరు వాళ్ళ అక్కగాని అన్నయ్యగాని ఊరు వెళ్లి పేరెంట్స్‌ దగ్గర ఒక్కరు ఉంటే ఎంతో హుషారుగా ఉంటారు. చెప్పలేని ఆనందం వారి ముఖంలో కనిపిస్తుంది.
మరి పరిష్కారం..?
ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ముందుగా దీనిని గుర్తించటం అవసరం. ఇంట్లో సాధారణంగా పేరెంట్స్‌ పెద్ద పిల్లలకు వాళ్ళ కన్నా చిన్నవాళ్ళని చూసుకునే బాధ్యతని అప్పగిస్తూ ఉంటారు. దానితో పెద్దవారు దీనినే ఆసరాగా తీసుకుని తమ అజమాయిషీ చెలాయించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎక్కడ కూర్చోవాలో, ఎవరితో ఆడాలో, ఎవరితో మాట్లాడాలో అన్ని విషయాల్లో తమ పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా మొదలైన సమస్యని చిన్నగా ఉన్నప్పుడే తల్లితండ్రులు గుర్తించి వాళ్ళ ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా చేయాలి. తిరిగి వాళ్ళు మామూలు స్థితికి వచ్చే దాకా ఒంటరిగా ఇద్దరినీ వదలకూడదు. వీలయితే సమస్య సర్దుకునేదాకా ఇద్దరినీ కాస్త దూరంగా ఉంచాలి. అలా దూరంగా ఉంచిన సమయంలో ఇద్దరి మధ్య ఆప్యాయత నెలకోనేలాగా కౌన్సిలింగ్‌ ఇస్తూ ఉండాలి.