కళల రేడు అడవి బాపిరాజు

సృజనశీల సాహిత్యం వేరు.. ఉద్యమ సాహిత్యం వేరు.. ఈ రెండింటినీ మెండుగా నడిపిస్తూ సమన్వయ పరుస్తూ కావ్యకర్తగా కృషి చేసిన అత్యంత అరుదైన కళాసాహితీ స్రష్ట – ద్రష్ట అడవి బాపిరాజు. కవి, గాయకుడు, నవలాకారుడు, చిత్రకారుడు, స్వాప్నికుడు.. ఇలా ఎన్నెన్నో ప్రజ్ఞా పాటవాలతో తెలుగు కళా సాహితీ జగత్తులో చల్లని వెన్నెల కాంతులు ప్రసరింప చేసిన అందాల చంద్రుడు అడవి బాపిరాజు అంటే అతిశయోక్తి కాదేమో!
     ఎవరు కుంచె పట్టుకుని వచ్చినా, కలం పట్టుకుని వచ్చినా వారిని చిత్రకారునిగా, రచయిగా ప్రసిద్ధుదయ్యే వరకు ఉచిత శిక్షణ ఇచ్చేవారు. ‘ఎప్పుడూ ఆనందంతో ఊహల్లో స్వేచ్ఛగా విహరించడం, సౌందర్యాన్ని నిత్యం అన్వేషించడం, అనుభవాన్ని పంచి పెట్టడం, కష్ట సమయంలో ప్రేమతో భుజం చరచడం- ఇదీ బాపిరాజు జీవితం పట్ల అలవరచుకున్న దృక్పథం.
‘అఖిల కళా వైభవశ్రీ అడవి బాపిరాజు’ పేర డా|| నాగసూరి వేణుగోపాల్‌ సంపాదకత్వాన ఇటీవల రెండు బృహత్‌ సంపుటాలు వెలువడినాయి. సాహితీ, చిత్రలేఖన, శిల్ప, నాట్య, సంపాదక, సినీ కళా నైపుణ్యాల విశ్లేషణలు వీటిలో ఉన్నాయి. బాపిరాజు సహచర గణం, సమకాలీన తరం, ఆ తరువాతి తరం వారందించిన ఈ సంపుటిల సమాచార వ్యాసమాలలు బాపిరాజు గుణ గణాలు విశ్లేషించడంతో పాటు ఆయన స్వరూప స్వభావాలను, విశిష్ట వ్యక్తిత్వాన్ని సైతం పాఠకులకు బొమ్మ కడ్తాయి. కొండను అద్దంలో చూపినట్టు బాపిరాజు జీవితము – కృషిని ఇవి చూపెడతాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి బాపిరాజు తెలుగు వానిగా జన్మించడం తెలుగు వారందరికీ గర్వకారణమని, 20వ శతాబ్దంలో తెలుగు భాషా సంస్కృతులను, సాహితీ కళాకృతులను సుసంపన్నం చేసిన వారిలో బాపిరాజు అద్వితీయులని సంపుటాలు తేటతెల్లం చేస్తాయి. ‘అడవి బాపిరాజు కవి, కథకుడు, నవలాకారుడు, పత్రికా సంపాదకుడు, నాట్యాచార్యుడు, సినీ కళా దర్శకుడు, న్యాయవాది, స్వాతంత్య్రోద్యమంలో కారాగార వాసం చేసిన దేశ భక్తుడు. ఇంతటి బహుముఖీన ప్రతిభ కలవారు తెలుగునాట మరొకరు లేరనుట అతిశయోక్తి కాదు’ అని భాషా సాహితీ ప్రియులు మండలి బుద్దప్రసాద్‌ ముందుమాటలో పేర్కొన్నారు.
1895లో జన్మించిన బాపిరాజు ఆరు పదుల వయసు మించకుండానే 1952లో అస్తమించడం విషాదం. ఆ చిరు వయస్సులోనే వారు చేసిన కృషి అనన్య సామాన్యం గనుకనే వారి రచనలు, చిత్రాలు ఖండాంతర సీమలు పరుచుకున్నాయి. కళలోనే పుట్టి, కళలోనే పెరిగి, కళలకు జీవితం అంకితం చేసి, కళా సేవలోనే కాలధర్మం చెందిన ధన్యజీవిగా అడవి బాపిరాజును నార్ల అభివర్ణిస్తారు.
బావా బావా పన్నీరు, లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా, గంగిరెద్దుల పాట, ఉప్పొంగి పోయింది గోదావరి / తెప్పున్న ఎగిసింది గోదావరి వంటి బాపిరాజు గీతాలు తెలుగు నాట ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించినవే. నారాయణరావు తుఫాను, కోనంగి, నరుడు, జాజిమల్లి, గోనగన్నారెడ్డి వంటి నవలలు పాఠకులకు సుప్రసిద్ధాలు.
బాపిరాజు వ్యక్తిగా ఎంత మహోన్నతుడో, ఆయన కృషీ అంతే మహోజ్వలంగా సాగినట్టు సంపాదకులు నాగసూరి వేణుగోపాల్‌ తెలుపుతారు. సతతం (బాపిరాజు) సమస్యలతో పోరాడుతూనే ఇంత విలక్షణంగా, ఇంత విస్తృతంగా, ఇలా సాధన చేయడం అబ్బురమనిపిస్తుందని నాగసూరి వివరిస్తారు.
బాపిరాజు సాహసం గురించి ప్రతి ఒక్కరూ ఒక్క విషయం తప్పక తెలుసుకోవాలి. భూమి కోసం, భుక్తి కోసం పీడిత ప్రజ విముక్తి కోసం సాగిన మహత్తర సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో రజాకార్ల దాష్టీకానికి ఎందరో అసువులు బాసిన విషయం విదితమే. అమాయక ప్రజలపై, స్త్రీలపై వారు చేసిన దుర్మార్గాలు, పెట్టిన చిత్రహింసలు చెప్పనలవి కాదు. పద్మజానాయుడు ఆ వివరాలతో పెద్ద నివేదికను సిద్ధం చేసారు. దానిని నిజాం తెలుగు పత్రిక యధాతథంగా ప్రచురించింది. నిజాం ప్రభుత్వ ప్రచార శాఖ మాత్రం దానిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది.
బాపిరాజు సంపాదకత్వంలో వెలువడే ‘మీజాన్‌’ పత్రిక ఈ రెండింటినీ ప్రక్కప్రక్కనే ప్రచురించింది. నిజాం ప్రభుత్వం ఇది ఎడిటింగ్‌ పద్ధతి కాదని విమర్శిస్తే, అంతకంటే ఘాటుగా బాపిరాజు ప్రతి విమర్శ చేసాడు. ‘(నిజాం) ప్రభుత్వ శాఖలో పని చేసే ఉద్యోగులు నేర్పవలసిన దుస్థితిలో మా సంపాదకులు లేరని, జాబు రాసి, ఆ జాబును యథాతథంగా ‘మీజాన్‌’లో ప్రచురించారు.
‘నేను చాలా కాలం క్రిందట జాతీయోద్యమంలో చేరుటకు న్యాయవాద వృత్తిని మానేశాను. ఎవరైనా తమపై కోర్లు అభియోగాలు మోపితే ‘మీజాన్‌’ చేస్తున్న సేవలను నిరూపించడానికి మరల నల్లకోటు ధరించడానికి వెనుకాడను’ అని బాపిరాజు సవాల్‌ విసరడం గమనార్హం. అదీ బాపిరాజు తెగువ, ధర్మదీక్ష. వారి శిష్యగణంలో ఒకరైన తిరుమల రామచంద్ర ‘ఆదర్శ పత్రికా సంపదుకుడు’గా ఈ విషయాన్ని వ్యక్త పరుస్తారు.
ఎవరు కుంచె పట్టుకుని వచ్చినా, కలం పట్టుకుని వచ్చినా వారిని చిత్రకారునిగా, రచయిగా ప్రసిద్ధులయ్యే వరకు ఉచిత శిక్షణ ఇచ్చేవారు. ‘ఎప్పుడూ ఆనందంతో ఊహల్లో స్వేచ్ఛగా విహరించడం, సౌందర్యాన్ని నిత్యం అన్వేషించడం, అనుభవాన్ని పంచి పెట్టడం, కష్ట సమయంలో ప్రేమతో భుజం చరచడం- ఇదీ బాపిరాజు జీవితం పట్ల అలవరచుకున్న దృక్పథం. ఈ దృక్పథం సమాజానికి ఎంతైనా అవసరం. కనుకనే ‘జీవితాంతం త్రిదశత్వాన్ని అనుభవించిన అదృష్టశాలి’గా రాంభట్ల కృష్ణమూర్తి చెప్పారు.
‘కవితా హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి బాపిరాజు రచనలు చదివిస్తాయి. కొన్ని వందల పేజీలు ఉన్న ఆ నవలలు ఒక్క రవ్వ కూడా విసుగు కలిగించవు. మనోహరమైన వర్ణన సంభాషణలతో చమత్కారం, సౌందర్యాన్వేషణ ఆయన నవలల్లో కన్పిస్తాయి. మంచే తప్ప చెడును చూడలేని ఒక భావకుని ఊహా ప్రపంచం ఆయన నవలల్లో కన్పిస్తుంది. అందుకే ఆయన నాయికా నాయకులు దోష రహితులు. ఆదర్శ జీవులు. ప్రణయ గాధ ఉదాత్తంగా ఉంటుంది. వర్ణనలు జుగుప్స కనిపించవు. ఉత్తేజపరుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కళను ఊహ నుండి వాస్తవానికి దించాడు బాపిరాజు.
‘బాపిరాజు పాడింది కవిత్వం. గీసిందల్లా చిత్రలేఖనం’ అని విశ్వనాధ వారంటే ‘బాపిరాజు మధురమూర్తి’ అని చలం ప్రశంసించాడు.
తెలుగు సంస్కృతి, సంస్కారం, సత్సంప్రదాయం బాపిరాజు సాహితీ కళా జగత్తు కృషిలో నవీన రూపంలో మూర్తీభవించాయి. బాపిరాజు వేసిన చిత్రాలను అర్థం చేసుకుని, సక్రమంగా విశ్లేషించగల ప్రతిభామూర్తి కానరాలేదని బుద్దవరపు కామరాజు అంటారు.
‘నా బ్రతుకొక పళిమరార్ద్ర నందనోద్యానము’ అని బాపిరాజే తన గురించి తానే స్వయంగా వ్యాఖ్యానించుకున్నారు. స్వీయ రచనలూ వీటిలో చోటుచేసుకున్నాయి.
‘ఆంధ్రదేశానికి తెలంగాణానికి మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి గావించి ఈ రెండు ప్రాంతాలను దగ్గరగా తీసుకుని వచ్చుటకు ప్రయత్నించిన మిక్కిలి కొద్దిమంది సారస్వత ప్రతులలో బాపిరాజు ముఖ్యంగా లెక్కింపదగినవారని’ దేవుల పల్లి రామానుజరావు కొనియాడారు.
‘ద్వేషమేనా బ్రతుకుమార్గం / వేషమేనా సత్య రూపం / మోసమేనా నిత్యకర్మం / మూర్తి మంతులకన్‌’ వంటి కవితా వచనలు నేటి రాజకీయ పరిస్థితులకూ అద్దం పడ్తాయి. ”ఫోనిక్సు పక్షిలా కొత్తదవుతూ / కొత్త భావాల్‌ కొత్త రుచులూ కొత్త లోకం పుట్టి వచ్చే” – జ్వాలలు గేయం చారిత్రక ఆశావహ దృక్పథాన్ని చాటుతుంది.
బాపిరాజు భాష వ్యవహారిక భాష. ఈ వాడుక భాష పుష్టిగా, ఆరోగ్యంగా, ఏపుగా రచనల్లో ఎదుగుతూనే ఉంటుంది. హద్దులు, సరిహద్దులు, సంకెళ్లు, చావు ఈ భాషకు ఉండదని కామరాజు చెప్పారు.
యువకుడుగా బాపిరాజు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో చేరి, ఆనాటి బ్రిటిష్‌ విద్యాధికారి ఆస్వాల్టు కూల్ట్రేకు ప్రియ శిష్యుడయ్యాడు. 1920లో పట్టభద్రులయ్యే సరికి గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణోద్యమంలో పూర్తి అంకిత భావంతో దుమికాడు. ఏడాది జైలు జీవితం అనుభవించాడు. కడతారు జైలుకు వెళ్ళాడు. తర్వాత బందరు జాతీయ కళాశాలకు కులపతిగా పనిచేశాడు. సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. నారాయణరావు నవలా నాయకుడు బాపిరాజు ప్రతిబింబంగా చెప్పుకుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలా పోటీలలో విశ్వనాథ వేయిపడగల నవలతో సమానంగా ఈ నవల ప్రథమ బహుమతి పంచుకున్నది. కళా సేవలో తన్మయమైనా బ్రతుకుతెరువుకై నాలుగేళ్ళు న్యాయవాద వృత్తిని కూడా చేపట్టారు. ఎక్కడైనా ఏ పనిలోనైనా తన ముద్రను బలంగా నాటాడు.
బాపిరాజుకు ముగ్గురు పిల్లలు శిశు దశలోనే దక్కకుండా పోయారు. పెద్ద కూతురు రాధ వసంత పసి వయసులోనే మైలయిటిస్‌ వచ్చి రెండు కాళ్ళు పడిపోయాయి. ఆయన భార్య నరాల వ్యాధి బారిన పడి చచ్చిపోతాననే ఫియర్‌ కాంప్లెక్స్‌తో బ్రతికింది. ప్రక్కనే ఇంత కష్టతరమైన బ్రతుకును పెట్టుకుని నిత్యం కళామతల్లి సేవలోనే ఆనందతాండవంతో తరించడం బాపిరాజుకే చెల్లించింది
.- కె.శాంతారావు
9959745723