జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌ కలకలం

–  నిందితులను పట్టుకున్న పోలీసులు
– క్షేమంగా బైటపడిన అధికారులు
 -హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో ఘటన
నవతెలంగాణ-చైతన్యపురి
సీజ్‌ చేసిన స్క్రాప్‌ దుకాణానికి పంచనామ చేసేందుకు వచ్చిన జీఎస్టీ అధికారులను వ్యాపారులు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులను విడిపించారు. ఇందుకు సంబంధించి ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం..సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డాక్టర్స్‌ కాలనీ సాయి కృష్ణనగర్‌ కాలనీలో గ్రేడ్‌ వన్‌ స్క్రాప్‌ దుకాణం ఉంది. దుకాణాదారు పన్ను చెల్లించకపోవడంతో మంగళవారం జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ చెల్లించడం లేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు దుకాణాన్ని సీజ్‌ చేశారు. బుధవారం జీఎస్ట్టీ ఇన్‌స్పెక్టర్‌ మనీష్‌, సూపరింటెండెంట్‌ ఆనంద్‌ పంచనామా చేస్తున్నారు. ఈ క్రమంలో దుకాణ యజమాని ఖయ్యూం మాట్లాడేది ఉందంటూ అధికారులిద్దరినీ పక్కకు తీసుకెళ్లాడు. వారిని మాటల్లో పెట్టి మరో ఇద్దరు వ్యాపారులతో కలిసి అధికారులను బలవంతంగా కారులో ఎక్కించారు. క్షణాల్లో కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఐడీ కార్డులు లాక్కున్నారు. వారిపై దాడి చేయడంతోపాటు డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇదంతా గమనించిన జీఎస్టీ అధికారుల కారు డ్రైవర్‌ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి అధికారుల సెల్‌ఫోన్‌ సిగల్‌ ఆధారంగా మలక్‌పేట్‌లో కారును గుర్తించారు. రాజివ్‌ చౌక్‌ వద్ద కిడ్నాపర్ల కారును పట్టుకొని అధికారులను క్షేమంగా విడిపించారు. నలుగురు నిందితులు సయ్యద్‌ ఫిరోజ్‌, ముజీబ్‌, ఇంతియాజ్‌, ముశీర్‌ను సరూర్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ప్రధాన నిందితుడు ఖయ్యుమ్‌ పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు.