ఒక్కసారిగా కూలిన ఐరన్‌ ర్యాంప్‌

9మంది కార్మికులకు గాయాలు
సాగర్‌ రింగ్‌ రోడ్డులో ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ప్రమాదం
నవతెలంగాణ -ఎల్‌బీనగర్‌
హైదరాబాద్‌లోని సాగర్‌ రింగ్‌ రోడ్డులో చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల్లో బుధవారం ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్‌ ర్యాంప్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సాగర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనుల్లో భాగంగా తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో స్లాబ్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఫ్లై ఓవర్‌ ఇనుప ర్యాంపు కూలిపోయింది. దాంతో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్య సేవల కోసం కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. వారంతా బీహార్‌కు చెందిన వారని తెలిసింది.
ప్రమాదం విషయం తెలసుకున్న ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని, బాధితులను అన్ని రకాలుగా విధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ పంకజం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. బాధితులకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

Spread the love