అభావం

ప్రతిరాత్రి…
కిటికీఅద్దం, వంతెనపై వెలుతురు బెజ్జాల
పిల్లంగోవిలా సాగిపోయె,
ఇస్మాయిల్‌ కవి రైలును చూపుతూ హాయిని పంచేది.

ఇవాళ మెరుపుల కత్తిలా..
సరాసరి నా గుండెల్లోకే దూసుకొస్తున్నది.

ఆ ఘటనను తలచుకుంటేనే..
రాస్తున్న కవితావాక్యం
గీత దాటి వక్రమార్గంలో
అక్షరాలు ఒకదానిపై ఒకటిపడి దొర్లుతూ
నుజ్జునుజ్జయి పోయి
అభావంగా అర్థరహితమై
మిగిలిపోయిన వికత భావన.

నీకేం..? విశ్వగురుత్వాకర్షణ సిద్ధయోగివి.
ఎప్పటిలా.. ఎక్కడ ఉన్నా..
వందేభారత రైలుగీత మాలపిస్తూనే ఉంటావు.

మళ్లిమళ్లీ బుల్లెట్‌ రైలు వేగంతో
దూసుకు రావడమే పరమావధిగా,
ప్రైవేటు పక్షాలతో ఎగురుతూ..
పై వైపు చూపులతో నిరీక్షిస్తూనే ఉంటావు.

చేతుల కంటిన నెత్తురును
లక్షల కరెన్సీ నోట్లతో తుడిచేసుకుని,
యథావిధిగా..
అసమర్థతకు ముసుగు కప్పి,
అనుకూలపు ఫైల్స్‌ సష్టికై
మంత్ర రాజదండం తిప్పుతునే ఉంటావు.

ఆగిన గుండెల ఆఖరు స్పందనలు,
అడ్రసు లేని శవాలు,
బతికి చచ్చినవాళ్ల భయంకరమైన భవిష్యత్తు,
ఆఖరి పోరులోను ఓడిన ఆకలి వలసలు,
చెదిరిన గూళ్లు, చెల్లాచెదురైన బతుకులు..
ఎలా అని..? ఎందుకని..?
ఇవేవీ నీకు పట్టవు.

ఎప్పటి మాదిరిగానే
ప్రైవేటును స్వాగతిస్తూ
పచ్చ జెండా పుచ్చుకు ఊపుతూ ఉంటావు.
నిన్నూ.., నీ తీరునూ.. అడ్డుకునేందుకనే
సామాన్యు డిపుడు
ఎర్ర జెండాతో సిద్ధమౌతున్నాడు.
– మడిపల్లి రాజ్‌కుమార్‌, 9949 699 215