న్యాయవాది విఠల్‌బాబు హత్య దారుణం : ఐలు ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బెజవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది రాయసం ఆదిశేషు విఠల్‌ బాబు ను కిడ్నాప్‌ చేసి హత్య చేయడం దారుణమని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూని యన్‌ (ఐలు) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఆయన మరణం పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు ఐలు అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, కార్యదర్శి కె పార్థ సారథి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో తరచూ న్యాయవాదుల మీద దాడులు, హత్యలు, తప్పుడు కేసులు నమోదు చేయటం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయ వాదులకు రక్షణ చట్టం చాలా అవసరమని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి సివిల్‌ కోర్టులో కేసు చూసుకుని బయటకు వచ్చిన న్యాయవాది విటల్‌ బాబును గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. పోలీసులు వెంబడిస్తున్న తరుణంలో కారును మార్చి మరో కారులో తీసుకెళ్లి చంపి, శవాన్ని పూడ్చిపెట్టడం చాలా దారుణమని విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోవడం బాధాకరమని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసులోని దోషులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.