మరకలు వదిలిద్దామిలా…!

మరకలు వదిలిద్దామిలా...!మనకు నచ్చిన బట్టల పైన కానీ, వస్తువుల పైన కానీ మరకలు పడి జిడ్డుగా మారి దుర్వాసన వస్తుంటే చాలా బాధగా ఉంటుంది. మరి అలాంటపుడు ఆ మరకలు, దుర్వాసన నుండి మన వస్తువులను ఎలా కాపాడు కోవాలో చూద్దాం…
– చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్‌ డిటర్జెంట్‌ సబ్బుతో రుద్ది ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి మరకలైతే మాత్రం వెనిగర్‌తో కేవలం ఆ ప్రాంతాన్ని మాత్రమే రుద్ది ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్‌ లేకుంటే గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్‌ బిళ్ళలు వేసి ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమవుతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ను మరకలపై రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.
– పెన్ను, లిప్‌స్టిక్‌ మరకలు బట్టలపై పడితే వాటిని ఓ పాత టవల్‌ పై ఉంచాలి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత ఉతకండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్‌ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.
– కార్పెట్‌ పై క్యాండిల్‌ చుక్కలు పడితే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్‌ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్‌ వ్యాక్స్‌ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్‌ మొనతో దానిని చెక్కేసి బ్రష్‌తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.
– ప్లాస్టిక్‌ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు.
– నిత్యం వాడే బకెట్లు మగ్‌లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్‌లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి ఆ తర్వాత సబ్బుతో కడగాలి.
– ప్లాస్కులో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. పొడిగా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు చెక్కెర అందులో వేసి మూతపెట్టి ఉంచండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.