తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు రానివ్వం

తెలంగాణలో
బీజేపీకి ఒక్క సీటు రానివ్వం– జాతీయ స్థాయిలో 28 పార్టీలతో ఇండియా కూటమి
– ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం)ను గెలిపించాలి :
– సీపీఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రానివ్వబోమని, అన్ని చోట్లా అడ్డుకుంటామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. కమ్యూనిస్టులకు పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీతో కలిసి రాఘవులు మాట్లాడారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలకు సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు.
ఆ పార్టీకి అధికారంలోకి రావాలన్న ద్వాసే లేదని, ఈ తరుణంలో వామపక్షాలను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునితీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ 2024 ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో అనుకూలమైన శక్తులను ఇప్పటినుంచే పోగేసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగల ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తుందని, నియంతృత్వాన్ని కొనసాగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల అనంతరం బీజేపీ ఆశలు సన్నగిల్లాయని, తెలంగాణలో దాని ప్రభావం తగ్గిందన్నారు. బీజేపీ బెదిరింపులకు భయపడే బీఆర్‌ఎస్‌ కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకుందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటు లేకపోయినా ప్రాంతీయ పార్టీల ఎంపీలు బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ కూడా ఇదే కోవలోకి చేరిందన్నారు.
తాము అధికారంలోకి వస్తే వామపక్షాలకు మంత్రులు, ఎమ్మెల్సీలు వంటి పదవులు ఇస్తామని చెప్తున్నారని, మాకు ఆ పదవులు ముఖ్యం కాదని ప్రజాక్షేత్రంలో నిలబడి తేల్చుకుంటామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజా పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉందని, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి నిర్మించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి కార్యకర్త.. కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, జగదీశ్‌, జిల్లా నాయకులు సామెల్‌, జగన్‌, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love