గులాబీలు పూయిద్దాం!

గులాబీలు పూయిద్దాం!ప్రేమను వ్యక్తం చేయాలన్నా, సంతోషాలను పంచుకోవాలన్నా.. ముచ్చట గొలిపే రంగుల్లో ముందుండే పూలంటే… గులాబీలే! … ఇతర పూల ప్రత్యేకతలు ఎన్ని చెప్పినా గులాబీలకు మరేవీ సాటి రావు. అలాంటి వీటి పెంపకానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సులువుగా పెంచుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా లక్షల రకాల్లో గులాబీ మొక్కలు దొరికితే, ఒక్క మన దేశంలోనే సుమారు యాభై వేల రకాలు అందుబాటులో ఉన్నాయట. ఫ్లోరీ బండా, హైబ్రీడ్‌, గ్రాండీఫ్లోరా, గుబురుగా ఉండేవి, తీగ జాతి, మినియేచర్‌, ట్రీరోజ్‌ అంటూ వీటిని ఏడు రకాలుగా శాస్త్రవేత్తలు విభజించారు. వీటిల్లోనే మళ్లీ రకాలుంటాయి. వివిధ రంగుల్లో ఉండే వాటిని ఇష్టాన్ని బట్టి ఎంచుకుని పెంచుకోవచ్చు చిన్నగా ఉండే మినియేచర్‌ గులాబీలు కానుకలుగా ఇవ్వడానికీ ఉపయోగపడతాయి.
సూర్యరశ్మి తగిలేలా…
సాధారణంగా తీసుకునే జాగ్రత్తల్లో కీలకమైనవి అంటే… ఎంత తక్కువ స్థలం ఉన్నా సరే, సాధ్యమైనంత వరకు గులాబీలను ఇతర మొక్కలతో పాటూ కలపకుండా విడిగా నాటడం మంచిది. ఇవి బంక మట్టి నేలలో చక్కగా పెరుగుతాయి. మట్టి యాభై శాతం తీసుకొని… మిగిలిన యాభై శాతం సేంద్రియ ఎరువులూ, బోన్మీల్‌, కోకోపీట్‌లు ఉండేలా చూసుకొని మొక్కను నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవన్నీ వాడినప్పుడు ఏ మట్టివాడినా మంచిదే. ఎక్కడ పెంచినా మొక్క చుట్టూ ఉన్న మట్టిని నెలకోసారి తొలిచి కొత్త మట్టిని కలుపుకోవాలి. మొక్కని నాటే ముందు దాన్ని నేరుగా నాలుగైదు గంటల పాటు ఎండ తగిలే చోట ఉంచాలి. అప్పుడే పూలు బాగా వస్తాయి. ట్రీ రోజ్‌ మొక్కలు మినహా మిగిలిన వాటన్నింటినీ కుండీల్లో పెంచుకోవచ్చు. అయితే కాస్త పెద్ద కుండీలను ఎంచుకొంటే మొక్క చక్కగా ఎదుగుతుంది. వానలు మొదలైన వెంటనే వీటిని నాటి, తగు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా పెరుగుతాయి.
పోషకాలు అందేలా…
బజార్‌లో వివిధ కంపెనీలకు చెందిన ‘వాటర్‌ సాల్యుబుల్‌ రోజ్‌ మిక్స్‌’ లభిస్తుంది. ఆ ప్యాకెట్‌పై సూచించిన మోతాదులో రోజా మిక్స్‌ని వర్షాకాలం ఆరంభంలో మట్టిలో కలుపుకోవాలి. దీన్ని మొక్కకు అందించే ముందు వేపపిండిని మట్టిలో కలుపుకొంటే ఆకులకూ, వేళ్లకూ వచ్చే చీడపీడల్ని నివారించవచ్చు. వేళ్ల దగ్గర చెక్క పొట్టూ, ఎండిన ఆకులూ, పత్తి గింజల పొడి, రంపం పొట్టు వంటివి వేస్తే మొక్కకు కావలసిన ఉష్ణోగ్రతా, వేర్లకు తగిన గాలి, తేమా అందుతాయి. సూపర్‌ ఫాస్ఫేటు తరుచూ చాలా తక్కువ మోతాదులో వేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మొక్కను కత్తిరించడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.
పురుగు పట్టకుండా…
గులాబీ మొక్కలకు ఒకేసారి కాకుండా నీళ్లను నెమ్మదిగా పోయాలి. మొక్క చుట్టూ ఉన్న మట్టి అంతా తడిసేలా చూసుకోవాలి. ఆకుల్ని ఎక్కువగా తడవనీయకపోవడమే మేలు. లేదంటే ఆకులకు తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. వాతావరణం, పెరిగే ప్రదేశాన్ని బట్టి గులాబీ మొక్కలకు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా నివారించేందుకు పరిష్కారాలున్నాయి. ప్రతి ఇరవై రోజులకోసారి కొద్దిగా సర్ఫ్‌ కలిపిన నీటితో ఆకుల్ని తుడవాలి. వేప, వంట నూనెలను నీళ్లల్లో కలిపి చల్లినా ఫలితం ఉంటుంది. ఆకులపై నల్ల మచ్చలు వచ్చినప్పుడు ఆర్గానిక్‌ ఫంగిసైడ్‌ చల్లితే సరి.