ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ – కంటేశ్వర్
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా సోమవారం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష-ప్రధానకార్యదర్శులు ఏశాల గంగాధర్- పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు గోళం లక్ష్మి, గోవర్ధన్, లక్ష్మీనరసయ్య, నర్ర కళ, సాయిలు, మరియు షికారి శీను, జానకంపేట లక్ష్మి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కలెక్టర్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రవేశం వల్ల పనులు కోల్పోయి బ్రతకడం కష్టంగా మారిన వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి 2005లో ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకున్నది. కానీ, రోజు-రోజుకు నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి కానీ, ఉపాధి కూలీల వేతనాలు మాత్రం పెరగట్లేదు. రోజుకు 60 రూపాయల నుండి 100 రూపాయలు మించి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి సంవత్సరం తగ్గిస్తున్నది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 25 వేల కోట్లు తగ్గించింది. అంటే పరోక్షంగా ఉపాధి హామీ పథకము నుండి ఉపాధి కూలీలను దూరం చేసి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్ర కనిపిస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ… 2023 – 2024 బడ్జెట్లో 2,40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం దేశ వ్యాప్తంగా ఆందోళన చేసింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అనేక ఆంక్షలు విధిస్తున్నది. మస్టర్ల విషయంలో,పేస్లిప్పుల విషయంలో అవకతవకలకు గురిచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ నిర్వహణకు కేంద్ర బడ్జెట్లో 2,40,000 కోట్లు కేటాయించాలి.200 రోజులు పని దినాలకు పెంచుతూ రోజువారి కూలీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 600 రూపాయలు ఇవ్వాలి. కూలీ డబ్బులు వారాంతంలో ఇవ్వాలి. పెండింగ్ కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి. ‌ ఉపాధి హామీ క్షేత్రాలలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి టెంట్లు వేయాలి, పిల్లలని పట్టుకోవడానికి ఆయాలను ఏర్పాటు చేయాలి, తాగునీటి సౌకర్యం కల్పించాలి. లేనిచో ఐదు లీటర్ల విఐపి మంచినీటి కిట్లను ఇవ్వాలి. పని క్షేత్రాలలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఓ ఆర్ ఎస్ పాకెట్లివ్వాలి. ‌ అన్ని రకాల పనిముట్లు అందించాలి, గడ్డపారలకు పదును పెట్టుకోవడానికి సరిపడ ఖర్చులివ్వాలి. ‌ ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలం ఇచ్చి., ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఉచిత ఇంటి రుణం అందించాలి, ఇప్పటికే ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాలిచ్చి నిర్మాణానికి ఉచిత రుణ సదుపాయం ఇవ్వాలి. ‌ చదువుకు దూరమవుతున్న ఈ అభాగ్యుల పిల్లలకు ప్రభుత్వమే విధిగా ఉన్నత చదువుల వరకు చదివించాలి. అర్హత కలిగిన వీరి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి.. ‌ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలి. పని అడిగిన ప్రతి ఒక్కరికి పని ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ఇవ్వలేకపోతె సగం కూలి చెల్లించాలి. పట్టణాలలో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Spread the love