ఇలా నిల్వ చేద్దాం…

ఇలా నిల్వ చేద్దాం...ప్రతి రోజూ కూరగాయల కోసం వెళ్ళే పరిస్థితి లేక వారానికి సరిపడా ఒక్కసారే తెచ్చిపెట్టుకుం టుంటాం. అయితే వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే చాలావరకు పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌ ఉన్నాసరే ఒక్కో సారి ఈ వథాని ఆపలేకపోతాం. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
– సాధారణంగా కూరగాయల్ని జాగ్రత్తగా చూసే కొంటాం. అయినా ఒక్కోసారి మన చూపు దాటుకుని పుచ్చులు వచ్చేస్తాయి. అలా పాడైన వాటిని గుర్తిస్తే వెంటనే వేరు చేయండి. ఫ్రిజ్‌లో పెట్టకుండా బయటే ఉంచండి. కుళ్లిపోయినంత మేరకు తీసేసి మొదట వాటినే వండటానికి ఉపయోగించుకుంటే మంచిది.
– టొమాటో, క్యాప్సికం, కీరదోస, బీన్స్‌ వంటి వాటిని ఫ్రిజ్‌లో కంటే బయట ఉంచ డమే మేలు. లేకుంటే అవి రుచిని కోల్పోవడమే కాకుండా వాటిపైన బూడిదరంగు మచ్చల్లా వచ్చేస్తాయి. ఆలూ ఎండలోనే ఉంచండి. లేకపోతే వాటికి మొలకలొస్తాయి.
– పుట్టగొడుగుల్ని కొన్న వెంటనే ప్లాస్టిక్‌ సంచీ నుంచి వేరు చేసి బ్రౌన్‌ పేపర్‌ బ్యాగలో పెట్టి ఫ్రిజ్‌లో కాకుండా భద్ర పరచాలి. ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
– క్యాబేజీని ఫ్రిజ్లో ఉంచితే వారం పాటు తాజాగా ఉంచగలుగుతాం. వెల్లుల్లిని చీకటిగా ఉండే చల్లటి పొడి వాతావరణంలో ఉంచాలి.
– కొత్తిమీరా, కరివేపాకు వంటి వాటిని గాలిచొరబడని డబ్బాల్లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.