– కిచ్చనాగారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – బడంగ్ పేట్
గతంలో అధికారంలో ఉన్న బీ.అర్.ఎస్ ప్రభుత్వం చెరువుల సుందరీకరణ నిర్మాణ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేయటం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చణగారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్ గూడ గ్రామ పరిధిలోని కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులను మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి చెరువుల సుందరీకరణ పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకు పూర్తి కాలేదని విమర్శించారు. ఒక సంవత్సరంలో సుందరీకరణ వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పి ఇంత వరకు పూర్తి కాలేదని మండి పడ్డారు. అభివృద్ధి పనుల కోసం రెండు చెరువులకు రూ.2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, మరో సంవత్సరం తర్వాత మరో రూ. 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పటం జరిగిందన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఎంత ఖర్చు చేస్తున్నారని విషయం తెలియలేదని ఆరోపించారు. ఈ సుందరీకరణ పనుల్లో నాణ్యత లేదని కాంట్రాక్టర్లతో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండి పడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సార్లు జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మా మాటలు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికీ సుందరీకరణ వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి కాకపోవటం ఏమిటని ప్రశ్నించారు. చెరువుల సుందరీకరణ పేరుతో చెరువుల పరిధిని కుదించటం దారుణమని, ఎఫ్ టీ ఎల్ పరిధి బఫర్ జోన్ లోపలి వైపు బండ్ నిర్మించటం ఎక్కడా చూడలేదని మండి పడ్డారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి విచారణ చేయించి ఇందుకు బాద్యులైన వారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు ఉంటాయన్నారు.ఈ సుందరీకరణ నిర్మాణ పనులు జాప్యం జరగకాకుండా ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా సుందరీకరణ పనులు జరిగేలా ఎలాంటి అవినీతికి తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోమటి కుంట ,పోచమ్మ కుంటల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ పనులు వెంటనే పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.కోమటి కుంట ,పోచమ్మకుంట, ఎర్రకుంటలకు పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయటానికి ప్రయత్నిస్తన్న బి ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లకు ఆ పార్టీ నేతల కబ్జాలను వెలికి తీస్తామని హెచ్చరించారు. అదే విధంగా వారికి సహకరించిన అధికారులను భరతం పడతామన్నారు.గత రెండు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారుల పైన కఠినంగా వ్యవరిస్తోందని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కబ్జా దారుల నుండి వెనక్కి తీసుకోవటం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇంటి స్థలాలు లేని పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.ఎవరైనా కాలనీలలో ఉన్న పార్క్ స్థలాలను కబ్జా చేసిన వాటిని గుర్తించి వెంటనే పార్క్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి సంబంధిత కాలనీ అసోసియేషన్ వారికీ అప్పగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవ్వారు మల్లారెడ్డి,బోయపల్లి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.