అమ్మలకు అమ్మలా…

Mother to mothers...అమ్మ అంటే మన దష్టిలో సూపర్‌ హీరో! ఇంట్లో అందరూ అన్నిటికీ అమ్మ మీద ఆధార పడుతూ ఉంటాం. మన అవసరాలు చెప్పాల్సిన పని లేదు. తనకు బాధ్యత గుర్తుచేసే అవకాశం మనకు రాదు. అమ్మకు అన్నీ తెలిసే ఉండాలి. అమ్మ తప్పు చేయదు. చేసే అవకాశం కూడా ఇవ్వస్త్ర. ఒకవేళ మనం తప్పు చేసినా అమ్మ చెయ్యకూడదు. అమ్మకు అలసట ఉండకూడదు. అనారోగ్యం ఉండకూడదు. అసహనం ఉండకూడదు. బాధలు కూడా ఏమీ పెద్దగా ఉండవు. ఎందుకంటే ఇంటిని చూసుకోవడం తప్ప ఇంకేం పని ఉందని తనకు? ఉద్యోగం తనకు తానుగా ఎంచుకున్నది. అందులో సాధకబాధకాలు కూడా తనే పడాలి. ఇల్లు కాకుండా అసలు అమ్మకంటూ వేరే ప్రపంచం ఎందుకు? ఇదీ మన సమాజం తీరు.
అమ్మ అంటే పరిపూర్ణత్వం అనే అపోహలో ఆమెపై ఈ సమాజం ఎంత ఒత్తిడి తీసుకొస్తోందో కేవలం ఆమెకే ఎరుక. ప్రేమను పరిపూర్ణంగా ఇవ్వగలదు గానీ కుటుంబమంతా తన పనిలో ఆశిస్తున్న పరిపూర్ణతను ఎలా సాధించాలో ఇంకా తెలియట్లేదు. అందుకే అందరితో మాట పడుతూ, మౌనం వహిస్తూ, కుంగుబాటుతో తన అస్థిత్వాన్ని ఎప్పుడో మరిచిపోయింది. మర బొమ్మలా మన అవసరాలు తీరుస్తోంది. కానీ అమ్మకూ మనసుంటుంది కదా! ఆ మనసుకు ఇలాంటి జీవితం నచ్చక కుంగిపోతోంది. ఫలితంగా అమ్మను అనేక శారీరిక, మానసిక రోగాలకు గురిచేస్తోంది. కుటుంబ వ్యవస్థలో పునాదులు కదిలిపోతే అంతస్తులు నేలకొరగడం ఎంత సేపు? ప్రస్తుతం మన కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉంది.
అమ్మ ఎవరికి చెప్పుకోవాలి
మనిషి సంఘ జీవి. పోటీ ప్రపంచంలో ఎంత పరుగు పెడుతున్నా, కష్టం వచ్చేసరికి మన కండ్లు సాటి మనిషినే వెతుకుతాయి. వాళ్ళ ఓదార్పు మనకు ఆ సమయంలో ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మరి అమ్మ కూడా మనిషే కదా? ఆమె తన కష్టాలను, బాధలను, సందేహాలను, సవాళ్ళను ఎవరితో పంచుకుంటుంది? ఇంట్లో చెబితే ఇదీ ఒక కష్టమేనా అంటారేమో అని భయం. పక్కింటి వాళ్లకు చెబితే ఊరంతా పాకుతుందని అనుమానం. అమ్మానాన్నలకు చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అనే ఆలోచన. మరెక్కడ చెప్పుకోవాలి? అమ్మ గురించి ఇదంతా ఎవరు ఆలోచించగలరు? మరో అమ్మ మనసు మాత్రమే దీన్ని ఆలోచించింది. ఆ అమ్మే ‘ప్రదీప్తి విస్సంశెట్టి’. ఆలోచన రావటం కన్నా ఆచరణ చాలా కష్టం. మీకేం సమస్యలున్నాయని ఎదుటివారిని అడగటం సంస్కారం కాదని ఆమెకు తెలుసు. అందుకే నెట్టింట్లో నేటి సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంది. అమ్మలకు అండగా తన వంతుగా ఫేస్బుక్లో ‘తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌’ అనే గ్రూపును సెప్టెంబర్‌ 4, 2019లో ప్రారంభించింది. మొదట్లో వందల్లో ఉన్న గ్రూపు సభ్యుల సంఖ్య నేడు ముప్పయి వేల పై చిలుకుకు చేరింది. అంటే ఎంత మంది అమ్మలకు సలహాలు, సహాయాలు అవసరమవుతున్నాయో మనకు అర్ధమవుతోంది.
మంచి అవగాహనతో…
ఒక గ్రూపులో సభ్యులు పెరుగుతున్నారంటే ఆ గ్రూపును ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారనే కదా! ఆ బాధ్యతను నిర్వహిస్తున్న గ్రూపు అడ్మిన్‌గా ప్రదీప్తి గురించి మనం కచ్చితంగా కొంత చెప్పుకోవాల్సిందే. కుటుంబంలో రెండో కూతురిగా, గారాల పట్టిగా పెరిగిన ప్రదీప్తి తల్లితండ్రులు శైలజ,శ్యామసుందర్‌. సమాజాన్ని సునిశితంగా పరిశీలించడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండడం నేర్చుకున్నారు. అంతేకాక తల్లి శైలజ నడిపే ఎన్జీఓ ‘సహజ ఫౌండేషన్‌’కు ఈమె సహా వ్యవస్థాపకురాలిగా ఉండటంతో సామజిక అవసరాలేంటో, అసహయులెవరో, ఎలా సహాయపడాలో మంచి అవగాహన వచ్చింది. కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేసిన ఆమెకు ఆధునిక సాంకేతికతపై పట్టు ఉంది. ప్రముఖ హౌటల్లో ఈవెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేయడంతో నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. అలాగే కంటెంట్‌ రైటర్‌గా, ఎడిటర్‌గా, మంచి చదువరిగా తనకున్న అనుభవంతో తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌ లోని యాభయి మంది అమ్మలతో కలిసి ‘అమ్మంటే’ అనే కథా సంకలనం 2021లో మాతదినోత్సవ సందర్భంగా ప్రచురించారు.
అనామిక పోస్ట్‌…
ఈ గ్రూపులో ప్రత్యేకంగా చెప్పుకోవలిసినది అనామిక పోస్ట్‌. ఎదుటివారికి మన భయం, బాధ చెప్పుకుంటే లోకువవయిపోతామేమో అనే భయం అందరికీ సహజం. కానీ అనామికగా మన కష్టం చెప్పుకోవచ్చు. ధైర్యం పొందవచ్చు. నిరాశ నుండి బయటపడే దారి తెలుసుకోవచ్చు. ఎవరో, ఏంటో తెలియకపోయినా గ్రూపులో ప్రతీ అమ్మ మేమున్నామంటూ అభయాన్నిస్తారు. ఇంకొక ముఖ్యమైన సంగతి. ఇందులో ఉండే ఎంతో మంది వైద్యులు తమ విద్యను, విజ్ఞానాన్ని సామజిక వికాసానికి ఉపయోగిస్తూ అమ్మలకు అండగా ఉంటున్నారు. వారి సేవ వెలకట్టలేనిది.
పారిశ్రామిక వేత్తలుగా అమ్మలు
ఉద్యోగాలు చేయడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, చదువుకుని నిరుపయోగం అయిందని బాధపడే అమ్మలకు తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌ వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. ఎంతో మంది మామ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ను తయారు చేసిన ఘనత ఈ ఫేస్బుక్‌ గ్రూపుది. ఇందుకోసం ప్రదీప్తి ప్రత్యేకంగా నిర్వహించే ‘ప్రోస్పెర్‌ విత్‌ ప్రదీప్తి’, ‘టి ఎం ఎన్‌ టాక్స్‌’ అమ్మలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఎంతో మంది నిపుణులు తమ సలహాలను, సూచనలను అందిస్తారు. ప్రదీప్తి దీనికి సంబంధించిన వీడియోలు 300 లకు పైగా చేశారు .ఫేస్బుక్‌ గ్లోబల్‌ కమ్యూనిటీ యాక్సిలరేటర్‌ ప్రొగ్రాము 2022 లో ‘మెటా’ ప్రపంచవ్యాప్తంగా 140 కమ్యూనిటీలలో ఒకటిగా గుర్తించింది.భారత దేశం నుండి ఎంపికైన 15 కమ్యూనిటీలలో ఒకటి.దక్షిణ భారత దేశం నుండి మన తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌ ఒక్కటే! ఇంతేకాక తానా, ఏపిఎన్‌ఆర్టిఎస్‌ తో కలిసి నిర్వహించిన ‘అమ్మా నీకు వందనం’ అనే కార్యక్రమంలో 1800 మంది అమ్మలతో ఆన్‌లైన్‌లో పాల్గొని తెలుగు బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లోనూ, ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లోను స్థానం సంపాదించుకుంది ఈ నెట్వర్క్‌.
పాత సామెతను మార్చేసింది
మానవ సంబంధాలు మరుగున పడి మాట సాయం కూడా కరువుతున్న ఈ రోజుల్లో అమ్మలకు అమ్మగా ఎన్నో కొత్త బంధాలను కలుపుతూ, ప్రేమలను పంచుతున్న తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌ ‘ఆడానికి ఆడదే శత్రువు’ అనే పాత సామెతను ‘ఆడదానికి ఆడదే అండ’ అని మార్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రదీప్తి తరుచుగా లైవ్‌లో స్ఫూర్తివంతమైన విషయాలను పంచుకుంటూ అందరినీ పలకరిస్తుంటారు. ఈ ఆన్‌లైన్‌ అమ్మల సంఘం ఇంకా ఎంతో మందిని కలుపుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.
అమ్మల పుట్టిల్లు
ఇప్పుడు ఈ ‘తెలుగు మామ్స్‌ నెట్వర్క్‌’ ముప్పయి వేల అమ్మల పుట్టిల్లు. ఇందులో ఎనభయేండ్ల అమ్మమ్మ నుండి ఇరవైఐదేండ్ల అమ్మల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. వీరంతా తమ సుఖదుఃఖాలను, సంతోషాలను, సందేహాలను, విజయాలను, విశేషాలను, విజ్ఞానాన్ని, కళలను, ఇష్టాఇష్టాలను, అభిరుచులను, ఆసక్తులను అందరితో పంచుకుంటారు. కానీ ఇవన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి. ప్రదీప్తి, స్వప్న అడ్మిన్స్‌గా ముప్పయివేల అమ్మలను ఒక తాటిపై నడిపించే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నారో చూడండి.
రోజు వారి ప్లానింగ్‌
సోమవారం – శారీరిక/ మానసిక ఆరోగ్యం, ఇంటి అలంకరణ చిట్కాలు, విషయాలు, సలహాలు.
మంగళవారం – మంచి అలవాట్లు, పుస్తక పరిచయాలు, పుస్తక విశ్లేషణలు, హాబీలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌.
బుధవారం – బిజినెస్‌ ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల ప్రకటనలు, యుట్యూబ్‌ చానల్స్‌.
గురువారం – తెలుగు సాహిత్య చర్చలు, సాహిత్య పోటీలు.
శుక్రవారం – తెలుగు ఆచారాలు, పండగలు, మన గ్రూప్‌ మహాలక్ష్మి.
శనివారం – వంటలు/వంటింటి చిట్కాలు/ రెసిపీలు, సౌందర్య చిట్కాలు, పిల్లల చదువులు సలహాలు/చిట్కాలు.
ఆదివారం – సినిమా కబుర్లు, విశ్లేషణలు, సరదా ఆటలు, మీ గురించి మీరు, లేదా మన గ్రూప్‌లో ఇతరుల గురించి మంచి చెప్పాలి అంటే ఇవాళ చెప్పేయండి. విశేషమేంటంటే ఇందులో ప్రతీ ఒక్కరు ఈ పట్టికను అనుసరించి అంతే క్రమశిక్షణగా నడుచుకునేలా చేస్తారు.
– డా|| హారిక చెరుకుపల్లి, 9000559913