బలవంతమైన సర్పము – చలి చీమలు
అద్దురా బిడ్డా అంటే
గాడు బాజాప్తా సేత్తా అంటడు
అది మనసుంటోల్ల అచ్చి రాదురా
లచ్చలతోటి పని అంటే ఇనడు
సదువు సాత్రం ఉన్నోనివి
ఆ గజ్జి నీకెందుకురా అన్నగానీ
సెవుటోని ముంగట శంఖూదినట్టే…
లొల్లులు కొట్లాటలుంటయి
పురుగుదిని పుట్టలుందాంరా అంటే…
ఇంకెన్ని రోజులు కాకా
గీ గులాం గిరి అంటడు…
తోకెంబట నారాయణా అని
ఎన్ని దినాలు తిరుగుదం…
పచ్చనోట్లకు, తప్ప సీసాలకు
ఎందుకమ్ముడు పోవాలే…
మనోల్లే మస్తు మంది ఉన్నరు గాదే…
అందరం ఒక్కటైతే
ఏ టికెట్‌ అవుసురం లేదు…
ఊల్లె ఇరువై ఇండ్లు లేని గాల్లు
ఇరువై ఏండ్ల సంది ఏలవట్రి…
గాల్ల మోసేతి కింది నీళ్లు తాగుడు
ఓల్లకు సుతం మంచిది కాదు…
వారం రోజులు స్వర్గం జూపిచ్చి
అయిదేండ్లు నరకంల పారేత్తుండ్రు..
ఇప్పటికైనా కండ్లు తెరిసి
ఇగురం తోటి ఒక్కటైదాం
ఇంటింటికి తిరుగుకుంట
ఇదంతా ఇప్పి సెప్తాం…
ఇగ ఎన్కకు పోవుడు లేదు
నిలవడుడు నిలవడుడే..
అంటే…
ఇగ నేనేంజేత్త…గాని
ఎన్క నడ్సి జై అనుడే..
సలి సీమలమై
బలమైన సర్పమును సంపుడే..!