– ఎంపీపీ నేనావత్ అనిత విజరు
– అధికారుల నివేదికలు, వివిధ అంశాలపై చర్చలతో ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ నేనావత్ అనిత విజరు అన్నారు. ఆమనగల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ అనిత విజరు అధ్యక్షతన ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను సభకు విన్నవించారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఎంపీటీసీలు ప్రశ్నించి వివిధ రూపాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆకుతోటపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాన్ని నివారించాలని కోఆప్షన్ సభ్యులు హాజీ పాషా సభకు విన్నవించారు. తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని చెన్నంపల్లి సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ సభ దృష్టికి తెచ్చారు. వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ వారికి కావలసిన వైద్య పరికరాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ఆస్పత్రిలో ఒకే ఒక బీపీ కొలమాని ఉందని అన్నారు. వెంటనే ఆస్పత్రికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తేవాలన్నారు. ఇదే విధంగా ఆయా శాఖల అధికారులు నివేదికలు సభకు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతు నాయక్, నిట్ట మంగమ్మ నారాయణ, అదనపు ప్రాజెక్టు అధికారి నీరజ, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి సక్రియ నాయక్, సహాయక ప్రాజెక్టు అధికారి జంగారెడ్డి, సర్పంచులు తిప్పిరెడ్డి నరసింహ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్, అమర్ సింగ్, లక్ష్మణ్ నాయక్, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.