సమాజం ఎన్నో మార్పులు సంతరించుకుంటోంది. నిరంతరం చెందుతున్న అభివృద్ధితో పాటు మన జీవనశైలీ మారిపోతోంది. ఈ క్రమంలోనే మహిళలు ఇంటా బయటా తామేంటో నిరూపించుకుంటున్నారు. వీళ్ళేం చేయగలరు అనే నిర్లక్ష్యపు మాట నుంచి వాళ్ళు మాత్రమే చేయ గలరనేంతగా మార్పు వచ్చింది. అన్ని రంగాల్లోనూ ధైర్యంగా నెగ్గుకురావడం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య అని ఓ పరిశోధన రుజువు చేసింది. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
ఒకేసారి వేర్వేరు పనులు చేయ డమే మల్టీ టాస్కింగ్. ప్రస్తుత ప్రపంచంలో ముందడుగు వేయాలంటే పోటీపడక తప్పదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీ టాస్కింగ్‌లో నిష్ణాతులు అయితే కానీ ముందుకు సాగలేని పరిస్థితి. ఇక మహిళల జీవితంలో అయితే ఈ మల్టీ టాస్కింగ్ తప్పనిసరిగా మారిపోయింది. ఒక పక్క వంట పని చూసుకోవాలి, మరోపక్క పిల్లల్ని బడికి సిద్ధం చేయాలి, ఇంకో పక్క ఇంటికి వచ్చే వారికి సమాధానం చెప్పుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా వారూ ఉద్యోగాలు చేస్తుంటే.. ఇక ఆ హడావుడి గురించి మాటల్లో చెప్పలేం. మొత్తానికి ఇంట్లోనే ఉండే గహిణులైనా, ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యో గినులైనా… మల్టీ టాస్కింగ్ మాత్రం తప్పనిసరిగా మారిపోయింది.
ఈ మల్టీటాస్కింగ్ చేయడంలో మగవారికీ, ఆడవారికీ మధ్య ఏమన్నా తేడా ఉందేమో అన్న అనుమానం వచ్చింది రష్యాకు చెందిన కొందరు పరిశోధకులకి. తమ అనుమానాన్ని నివత్తి చేసుకునేందుకు గాను 140 మందిని ఎంచు కున్నారు. వీరిలో 69 మంది మగవారు కాగా, 71 మంది ఆడవారు. వీరిలో 20 నుంచి 65 ఏండ్లలోపు వయసు కలిగిన వారు ఉన్నారు. వీరందరికీ కూడా ఒకేసారి వేర్వేరు పనులు అప్పగించారు. ఉదాహరణకు ఒక చేత్తో వేర్వేరు ఆకారాలలో ఉన్న వస్తువులను వేరు చేస్తూ, మరో చేత్తో వేరు వేరు అంకెలని వరుసక్రమంలో ఉంచమన్నారు.
ఈ మల్టీటాస్కింగ్ చేస్తున్న సమయంలో అభ్యర్థుల మెదడు ఎలా పని చేస్తోందో తెలుసుకొనేందుకు ఎమ్మారై పరీక్షలు కూడా చేసి చూశారు. దీంతో మల్టీటాస్కింగ్ చేసే సమయంలో మగ వారి మెదడు ఆడవారి మెదడుకంటే ఎక్కువ శక్తిని వినియో గించుకోవడాన్ని గమనించారు. అలాగే వేర్వేరు పనులు ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు, వారి మెదడు లోని వేర్వేరు భాగాలన్నీ కలసి పని చేయాల్సి వచ్చిందట. కానీ ఆడవారిలో మెదళ్లు మాత్రం ఎలాంటి హడావుడీ లేకుండా అతి తక్కువ సమయంలో, అతి తక్కువ శక్తిని ఉపయోగిస్తూ… వేర్వేరు పనులను ప్రశాంతంగా నిర్వహించేశాయి. 50 ఏండ్లు దాటిన తర్వాతగానీ ఆడవారిలో మల్టీటాస్కింగ్ సామర్థ్యంలో తగ్గు దల కనిపించడం లేదని వారు ఈ పరిశోధనతో తేల్చారు.
ఆడవారిలో కనిపించిన ఈ ప్రత్యేకతకి కారణం ఏమిటన్నది మాత్రం పరిశోధకులకు ఇంకా అంతుపట్ట లేదు. బహుశా ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఆడ వారికి అప్రయత్నం గానే ఈ నైపుణ్యం వచ్చి ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మనో నిబ్బరంతోనే ఇది సాధ్యపడి ఉంటుంది. కానీ ఒకేసారి ఇన్నేసి పనులు చేస్తున్నారు కదా అని.. వారితో వీలైనంత చాకిరీ చేయించుకోవడమే బాధ కలిగించే విషయం.