పారాహుషార్.. హద్దు దాటొద్దు.. నోరు జారోద్దు

 – వ్యక్తిగత దూషణలు, విమర్శలు నేరం
 – ప్రచారంలో అభ్యర్థులు జర జాగ్రత్త
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తివడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకొంది. మంథని నియోజకవర్గంలో పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కొందరు అభ్యర్థులు లక్ష్మన రేఖ దాటుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము గెలుపొందితే ప్రజలకు, సమాజానికి ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేస్తామో చెప్పుకోవాలి. కానీ ఇలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం, కుల మత పరమైన ఉద్రేకాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం నిషేధం. అభ్యర్థులు ఎవరైనా అలా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేయవచ్చు. దీనికి ప్రత్యేక టోల్ ప్రి నెంబర్, యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎన్నికల సంఘము మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని ఖచ్చితంగా పాటించాలని సూచించింది. కట్టు తప్పితే వాటిపై అధికారులు నిఘాతో పాటు ప్రత్యర్ధుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.ఇప్పటికే ఎన్నికల సంఘము మార్గదర్శకాలపై పార్టీల నాయకులకు, అభ్యర్థులకు అవగాహన కల్పించారు.
ఇవి గుర్తించుకోవాలి..
అప్పటికే ఉన్న విబేధాలను మరింత రెచ్చగొట్టేలా పరస్పర ద్వేషాన్ని పెంచేలా ప్రసంగించడం, కులాల, జాతుల మధ్య మత పరమైన, బాష పరమైన ఉద్రేకాలను సృష్టించేలా ఏ పార్టీ అభ్యర్థులు ప్రవర్తించకూడదు. ప్రత్యర్థి పార్టీ విధానాలు, కార్యకలాపాలపై మాత్రమే విమర్శలు చేయాలి. వ్యక్తిగత జీవితంపై మాట్లాడరాదు. ఓట్లను పొందేందుకు కులం, మతపరమైన భావాల పరంగా అభ్యర్ధనలు చేయకూడదు. ప్రచారం కోసం ఏ మతం ప్రార్థన మందిరాలను, మరేయితర ఆరాధన ప్రదేశాలను వేదికగా ఉపయోగించరాదు. అలా చేస్తే ఎన్నికల నియామవలి ఉల్లంఘన కిందికే వస్తుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బహుమతులు ఇవ్వడం, బెదిరింపులకు గురి చేయడం అసలు ఓటర్లకు బదులుగా వేరే వ్యక్తులను ఓటర్లుగా సూచించడం తప్పు. పోలింగ్ స్టేషన్ కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు ఏర్పాటు అవకాశం లేదు. శాoతియుత గృహ జీవనం ప్రతి వ్యక్తి హక్కు. వ్యక్తుల ఇంటి ఎదుట వ్యతిరేక ప్రదర్సనలు, పీకేటింగ్ లకు దిగడం లక్ష్మన రేఖ దాటాడమే అవుతుంది. పార్టీల జెండాలు పాతడం, బ్యానర్లు కట్టడం, నోటీస్ లు అతికించడం, నినాదాలు రాయడం ఇతరత్రా పనులకు స్థల, భవన యజమానుల అనుమతులు తీసుకోవాలి.