రాజస్థాన్‌ వస్త్ర వ్యాపారి పరార్‌..?

– దాదాపు ఏడు కోట్లతో ఉడాయింపు
నవతెలంగాణ-ఆర్మూర్‌
నమ్మకంగా ఉంటూ.. ఏకంగా సుమారు ఏడు కోట్ల రూపాయలతో ఓ రాజస్థాన్‌ వ్యాపారి పరార్‌ అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో వెలుగుజూసింది. దీనికి సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, డబ్బు తీసుకున్న వ్యక్తి పేరు చెప్పడానికి బాధితులు నిరాకరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్‌ పట్టణంలో ఏడేండ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి.. వ్యాపారం కోసం ప్రముఖుల నుంచి, వడ్డీ వ్యాపారస్థుల నుంచి, ఫైనాన్స్‌ల వారి వద్ద అప్పులు తీసుకుంటూ తిరిగి చెల్లిస్తుండేవాడు. నమ్మకంగా ఉండటంతో అతనికి వారంతా పెద్దమొత్తంలో అప్పులు ఇస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా తీసుకున్న వ్యాపారి రాత్రికిరాత్రే పరారైనట్టు సమాచారం. నెల రోజులైనా షాప్‌ తీయకపోగా, ఇంటికి సైతం తాళం వేసి ఉంది. ఫోన్‌ చేసినా స్పందన రాకపోవడంతో తాము మోసపోయినట్టు పలువురు బాధితులు వాపోతున్నారు. కానీ, బాధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు.