విద్యుద్ఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-ఆళ్ళపల్లి
వంతెన నిర్మాణం పనులకు వెళ్లిన ఓ వ్యక్తికి పనుల వద్ద ఉన్న రాడ్‌ లేపే క్రమంలో మేయిన్‌ లైన్‌ తీగలకు తగలడంతో కరెంట్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాలైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన మడకం పోషయ్య గురువారం గ్రామ సమీపంలో జరిగే బ్రిడ్జి నిర్మాణం పనులకు వెళ్లాడు. పనిలో భాగంగా అక్కడ ఉన్న రాడ్‌ను లేపే క్రమంలో పైనున్న మేయిన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో కరెంట్‌ షాక్‌ గురై కింద పడ్డాడు. తోటి కూలీలు గమనించి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గుండాల నుంచి వచ్చిన అంబులెన్స్‌లో ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యాధికారి అర్వపల్లి రేవంత్‌ సూచనల మేరకు వైద్య సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, పోషయ్య కుడి చేతికి తొడల భాగంలో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించాలని తీసుకొచ్చిన కూలీలు, బంధువులు, సంబంధిత గుత్తేదారుడికి సూచించారు. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో పోషయ్య ఆరోగ్యం శుక్రవారం కొంత నిలకడగా ఉందని, కొన్ని రోజులు గడిస్తే గానీ క్షతగాత్రుడి ఆరోగ్యం పట్ల స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు.