దశలవారీగా కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ

– ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మరికొంత మంది అధ్యాపకులను దశలవారీగా క్రమబద్ధీకరించాలని సర్కారు భావిస్తున్నది. త్వరలోనే వారిని క్రమబద్ధీకరించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. మే, జూన్‌లో ఇంటర్‌, పాలిటెక్నిక్‌, కళాశాల విద్యలో 3,897 మంది కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. దీంతో వారంతా రెగ్యులర్‌ అధ్యాపకులయ్యారు. ఇంకోవైపు సరైన అర్హతలు లేని కారణంగా కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించలేదు. అందులో కొంత మంది ఇతర రాష్ట్రాల్లోని దూరవిద్యలో చదివినవాళ్లున్నారు. అంతే కాకుండా బయటి రాష్ట్రాల స్టడీ సెంటర్లు రాష్ట్రంలో ఉండగా వాటిల్లో చదివినవారు కూడా ఉన్నారు.