ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు

– కర్నాటక ఫలితాలు చారిత్రాత్మకమైనవి
– ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ కమిటీ చైర్మెన్‌ పవన్‌ ఖేరా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అడిగిన ఏ ప్రశ్నకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదని ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ కమిటీ చైర్మెన్‌ పవన్‌ ఖేరా విమర్శించారు. కర్ణాటక ఫలితాలు చారిత్రాత్మకమైనవి అన్నారు. కర్నాటక ఎన్నికల్లో మీడియా, విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకే మోడీ 48 సభల్లో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో పార్టీ నేతలు మల్లురవి, జి నిరంజన్‌, అద్దంకి దయాకర్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మానవతారారు, రవళిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. దేశ ప్రధానిగా ప్రజలను విభజించే కుట్ర చేయడం బాధాకరమని చెప్పారు. దేశ భవిష్యత్తు ఏమై పోయిన పర్వాలేదన్నట్టు ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రధానికి పట్టవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బ తీసేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న అస్సాం సీఎం అదే పని చేశారనీ, నేడు మణిపూర్‌లో ఇదే చేస్తున్నారని తెలిపారు. ఆ ఘర్షణల్లో ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో భావోద్వేగాలు సర్వసాధారణమన్నారు. వాటిని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు నమ్మకాన్ని కలిగించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమనీ, దేశ ప్రజల స్వప్నాలను నెరవేర్చడమే లక్ష్యమని చెప్పారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, హిమాచల్‌లో ఇచ్చిన హామీలను మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటి కేబినెట్‌లో నేరవేర్చుతామని ఆయన వివరించారు.
తెలంగాణలోనూ కమీషన్ల సర్కారును గద్దె దించుతాం మాజీ ఎమ్మెల్యే సంపత్‌
కర్నాటక రాష్ట్రంలో 40శాతం కమీషన్లు తీసుకున్న బీజేపీని ఓడించామనీ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణలో 30 శాతం కమీషన్ల సర్కారును ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ కమీషన్ల గురించి మాట్లాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో తెలంగాణ ఎన్నికల్లోనూ వ్యూహత్మకంగా ముందుకు పోతామన్నారు. కమీషన్ల బీఆర్‌ఎస్‌ సర్కారు ఓడిస్తామని చెప్పారు.