అక్షరాలు అమ్మే దుకాణాలుగా ప్రయివేటు విద్యాసంస్థలు

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు తరంగ్‌
– శ్రీచైతన్య పాఠశాలలో పుస్తకాల విక్రయాలపై ఆందోళన
 – విక్రయ పుస్తకాలు స్వాధీనం ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
– వేలాది రూపాయలు వసూలు చేస్తున్న వైనం అప్పులు చేసి పుస్తకాలు కొనుగోలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
– ఇబ్రహీంపట్నం శ్రీచైతన్య పాఠశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అక్షరాలు నేర్పే విద్యా సంస్థలు, అక్షరాలు అమ్మే దుకాణాలుగా మారాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు తరంగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో శ్రీ చైతన్య పాఠశాలలో పుస్తకాలు విక్రయాలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకు పూనుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్న పుస్తకాలను స్వాధీనం చేర్చుకున్నారు. విద్యాధికారి వెంకటరెడ్డికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫీజులో నియంత్రణ చట్టం అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు 25శాతం ఉచిత విద్య అందించాలన్నారు. అదే విధంగ జిల్లాలో అనేక ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. అనేక కార్పొరేట్‌ పాఠశాలల్లో యదేచ్ఛగా ఫీజులు వసూళ్లు చేస్తూ, తల్లిదండ్రులను పీడిస్తూ పాఠశాలలు నడుపుతున్నారని విమర్శించారు. జిల్లాలో తగు అనుమతులు లేకుండా విద్యాసంస్థలు పదుల సంఖ్యలో బ్రాంచీలు ప్రారంభిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్న కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్షరాలు నేర్పే విద్యాసంస్థలను, అక్షరాలు అమ్మే దుకాణాలుగా మార్చేస్తున్నారన్నారు. యూనిఫారం, బూట్లు, ,టై, బుక్స్‌, స్పోర్ట్స్‌ డ్రస్‌ తదితర మెటీరియల్‌ తమ పాఠశాలలోనే తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. బుక్స్‌, యూనిఫాం పేరుతో వేల రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు ఫీజులు నియంత్రించకపోతే పాఠశాలల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మండల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మద్దెల శ్రీకాంత్‌, కమిటీ సభ్యులు సుమంత్‌ నాయకులు లక్ష్మణ్‌, మనోహర్‌, సోహెబ్‌, వర్షిత్‌, నాని, విక్కీ, శివ ఎం రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.