చాలా మంది దంపతులు పిల్లలను తమవెంటే బెడ్‌పైనే పడుకోబెట్టుకుంటారు. ఇలా పిల్లలను పడుకోబెట్టుకోవడం మన దేశంలో చాలా కామన్. వారికి 10-12 ఏండ్లు వచ్చేంత వరకు ఇదే ధోరణి ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.. దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గడంతో పాటు పిల్లల ఎదుగుదలపై, వారిలో స్వతంత్ర భావాలు రేకెత్తడంపై ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు.
దంపతుల మధ్య సమస్యలు
పిల్లలతో కలిసి పడుకునే దంపతుల్లో సాన్నిహిత్యం రోజురోజుకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో కలిసి పడుకోవడం వల్ల దంపతులకు ఏకాంత సమయం దొరకదు. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా పిల్లలు పక్కనే ఉంటారు. దీని వల్ల దాంపత్యబంధంలో సాన్నిహిత్యం తగ్గిపోతుంది. సంసార జీవితంలో క్రమంగా కలతలు వస్తాయి. అదే పిల్లలను విడిగా పడుకోబెట్టడం వల్ల దంపతులు ఏకాంతంగా ఉంటారు. మంచీ చెడు మాట్లాడుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది.
పిల్లలకు ప్రత్యేక గది
మూడు నెలల వయస్సు వచ్చినప్పటి నుంచే వారిని బెడ్‌కు దూరంగా ఉయ్యాల క్రిబ్ వేసి అందులో పడుకోబెట్టాలి. ఏడాది వయసు వచ్చే వరకు ఇలాగే పడుకోబెట్టాలి. ఏడాది వయసు దాటిన తర్వాత క్రమంగా వారికి ప్రత్యేక గది అలవాటు చేయాలి. రాత్రంతా ప్రత్యేక గదిలో పడుకోబెట్టడం కాకుండా.. కొన్ని గంటల చొప్పున సమయం పెంచుతూ పోవాలి. అలాగే ప్రత్యేక గదిలో పడుకోబెట్టినప్పటికీ వారిని మధ్యమధ్యలో గమనిస్తూ ఉండాలి. వారి అవసరాలు తీరుస్తూ ఉండాలి. కెమెరాలు, బేబీ మానిటర్ లాంటివి అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వారిని ప్రత్యేక గదికి అలవాటు చేయడంతో పాటు వాళ్లెలా పడుకుంటారోనన్న భయమూ ఉండదు.
జాగ్రత్తలు
వాల్ పెయింటింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, థీమ్ బెడ్, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులతో వారి గదిని అలంకరించాలి. కొంత వయస్సు వచ్చిన తర్వాత వారి గదిలో వస్తువులను వారే సర్దుకునేలా అలవాటు చేయాలి. అలాగే పిల్లలు భయపెట్టే కథలు వినిపించడం, హార్రర్ సినిమాలు చూడటంలాంటివి చేస్తే వాళ్లు ఒంటరిగా పడుకోవడానికి భయపడతారు. కాబట్టి అలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఎప్పుడైనా పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడక పోయినా, భయపడినా ఆ సమయంలో వారితో కలిసి కాసేపు పడుకోవాలి. చుట్టాలు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలను మీతో పడుకోబెట్టుకుని వారికి పిల్లల గదిని కేటాయించాలి. అంతే తప్ప కొత్తవారితో పిల్లలను పడుకోమని బలవంత పెట్టవద్దు. అలాగే పిల్లలు అభద్రతా భావానికి లోనుకాకుండా వారితో స్నేహంగా మెలగాలి. ఏదైనా సమస్య ఉంటే నిర్మొహమాటంగా చెప్పే పరిస్థితి వారికి కల్పించాలి. అలాగే వారి గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.