‘హరిప్ర్రియ’ కవిత్వం
తెలంగాణ తెలుగు మాగాణం. తెలుగు భాషా సాహిత్యాల అవిర్భానికి తల్లి వేరు. ‘అచ్చ తెనుగు కబ్బమునకు,’ దేశీయ కళా సంపదలకు పెట్టిన పేరు. వీరోచితమైన ఈ మట్టిఒడిలో అపురూపమైన సాంస్కతిక చైతన్యం జీవనదిలా పచ్చపచ్చగా ప్రవహిస్తుంటుంది. ప్రభావశీలమైన ఎన్నో ప్రజా పోరాటాలు పురుడు పోసుకున్న ఈ సమర క్షేత్రంలో నవచేతనా భరితమైన జీవన గీత నింగి చెవులు మారుమోగేలా నిరంతరం ప్రతిధ్వనిస్తుంటుంది. జాతిని మేలుకొలిపే బతుకు పాటల కడలి ఈ నేలపై నిత్యం పోటెత్తుతుంది. అందువల్లనే ఇక్కడ గడ్డిపోచ కూడా కపాణమై గర్జిస్తుంది. ఇచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవతో స్ఫూర్తి పరిమళాలను ప్రసరిస్తుంది.
గత రెండు సంవత్సరాల్లో సిటీ కళాశాల తెలుగుశాఖ నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ భాషా, సాహిత్య సదస్సుల్లో, కార్యశాలల్లో, కవి సమ్మేళనాల్లో హరిప్రియ క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, ఈ కార్యక్రమాల ప్రేరణతో కర్తత్వానికి పుటం పెట్టుకొని, తన గుండెల్లో వెల్లువెత్తుతున్న భావవాహినికి అక్షర రూపం ఇస్తూ ‘తొలి ఉషస్సు’ పేరుతో కవితా సంపుటి తీసుకు వచ్చింది.
తెలంగాణలో ఆంధ్ర కవులు పూజ్యము అన్న ముడుంబ రాఘవాచార్యుల దురహంకారాన్ని ఖండిస్తూ, గోలకొండ కవుల సంచికను ప్రకటించి తెలంగాణ సాహిత్య ప్రతాపాన్ని సురవరం ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో, అనంతర కాలంలో తెలంగాణ గొప్ప సాహిత్య, సాంస్కతిక చైతన్యం నవ నవోన్మేషంగా వెల్లివిరుస్తుంది. ఈ సాంస్కతిక సామ్రాజ్యంలో పెద్దలతో పాటూ పిన్నలూ మేము సైతం అంటూ కవన కదనరంగంలో కలం దువ్వుతున్నారు. సాంఘిక ఉద్యమాల ప్రేరణ, సామాజిక మాధ్యమాల ప్రభావం, గురువుల ప్రోత్సాహం తో అభిరుచి కలిగిన విద్యార్థులు సజన రంగం వైపు చూపు సారిస్తున్నారు. ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే’ విద్యార్థులు చిరుపొత్తాలను వెలువరించి, సుప్రసిద్ధ కవి పండితుల మన్ననలందుకుంటున్నారు.
భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా, విశిష్ట సాహిత్య, సాంస్కతిక, కళా కేంద్రంగా కూడా విరాజిల్లుతున్న ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) విద్యార్థులు మంచి కవిత్వం రాస్తూ, పుస్తకాలు వెలువరిస్తున్నారు. 1948లోనే ఈ కళాశాలలో అధ్యాపకులు ‘తెలుగు సాహితీ సమితి’ స్థాపించి ప్రతి సంవత్సరం అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిం చారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీనిరంజనం, ఆచార్య బిరుదురాజు రామరాజు, చెలమచెర్ల రంగాచార్యులు, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం వంటి ఉద్దండ కవి పండితులు, సిటీ కళాశాల లో కొంతకాలం తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహించి విద్యార్థుల్లో సాహిత్య చైతన్యాన్ని కలిగించారు. తెలుగు, ఉర్దు, హిందీ, కన్నడ, మరాఠి, ఆంగ్లం వంటి బహుముఖీన భాషా, సాహిత్య, సంస్కతులకు సిటీ కళాశాల ఆలవాలంగా నిలిచింది. ఆరు భాషలకు సంబంధించిన విద్యార్థుల రచనలతో ఆ రోజుల్లో కళాశాల వార్షిక సంచిక వెలువడటం అరుదైన విషయం. ఒకప్పుడు ఈ కళాశాలలో విద్యనభ్యసించిన కాళోజీ నారాయణ రావు, డా.పరుచూరి గోపాలకష్ణ, జె కె భారవి, ఆచార్య యస్.వి. సత్యనారాయణ, డా. బైరెడ్డి కష్ణారెడ్డి, మందలపర్తి కిశోర్ తదితరులు రచయితలుగా, విమర్శకులుగా ప్రఖ్యాతిగాంచారు. మఖ్దూమ్ మొహియుద్దీన్ వంటి గొప్ప ప్రజా కవి కవితా గానంతో సిటీ కళాశాల తరగతి గదులు ఎరుపెక్కాయి. డా. వెలిచాల కొండలరావు, పరిమళా సోమేశ్వర్, యాకూబ్, శ్రీకాంత్, కోయి కోటేశ్వరరావు లాంటి కవులు, రచయితలు కళాశాలలో పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఎప్పటికప్పుడు సజనోత్తేజాన్ని కలిగిం చారు. నాలుగేళ్ల క్రితం శ్రీనిధి (డిగ్రీ మొదటి సవత్సరంలోనే) ‘రాలిన చుక్కలు’ అనే కవితా సంపుటిని వెలువరించింది.
చిన్నపట్ల హరిప్రియ సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని కేరూర్ గ్రామంలో శ్రీలత, విఠల్ గౌడ్ దంపతులకు జన్మించింది. బాల్యం నుండే హరిప్రియ జ్ఞాన పిపాస, సజన జిజ్ఞాస కలిగిన విద్యార్థిని. ప్రస్తుతం ప్రభుత్వ సీటీ కళాశాలలో బి.కామ్ తతీయ సంవత్సరం చదువుతుంది. ఒకవైపు చదువుల్లో రాణిస్తూనే, మరొక వైపు సాహిత్య, సాంస్కతిక, రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ, మునుముందుకు సాగిపోతుంది. గత రెండు ఏండ్లలో సిటీ కళాశాల తెలుగుశాఖ నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ భాషా, సాహిత్య సదస్సుల్లో, కార్యశాలల్లో, కవి సమ్మేళనాల్లో హరిప్రియ క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా, ఈ కార్యక్రమాల ప్రేరణతో కర్తత్వానికి పుటం పెట్టుకొని, తన గుండెల్లో వెల్లువెత్తుతున్న భావవాహినికి అక్షర రూపం ఇస్తూ ‘తొలి ఉషస్సు’ పేరుతో కవితా సంపుటి తీసుకువచ్చింది. సాధారణంగా ఈ తరం విద్యార్థులు రాసే కవిత్వంలో ఆత్మాశ్రయ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. చాలామంది విద్యార్థులు ఊహా ప్రేయసి వలపుల వానల్లో తలమునకలుగా తడిసిపోతూ ప్రణయైక భావంతో కవిత్వం రాస్తుంటారు. ఇలాంటి శైలి ఒకింత హరిప్రియ కవిత్వంలో లేకపోలేదు. అయితే ఇక్కడే హరిప్రియ ఆగిపోలేదు. ప్రధానంగా కుటుంబ సంబంధాల ఔన్నత్యం, మానవ సంబంధాల ఆవశ్యకత బాల్యానుభూతుల నెనరు, ఈనాటి స్త్రీల అస్తిత్వ వేదన, పరువు హత్యల హింస, దేశభక్తి భావన, పర్యావరణ స్పహ తదితర అంశాలను హరిప్రియ సరళ సుందరంగా కవిత్వీకరించింది. అమ్మ, నాన్న, గురువు ఈ త్రిమూర్తులను నుండి అంది పుచ్చుకున్న మౌలిక సంస్కారాన్ని, విశ్వజనీన మైన వారి అనుబంధాన్ని, ఉమ్మడి కుటుంబంలో పరిమళించే అత్మీయతల మాధుర్యాన్ని సముచితంగా హరిప్రియ అక్షర బద్ధం చేసింది.
”కూర్మిని వాగ్ధానంచేసే కుటుంబ అనుబంధం / విశ్వజనీన గమనానికి విలువైన ఇంధనం” అంటూ వసుధైక కుటుంబ విశిష్టతను తన కవిత్వం లో ఆవిష్కరించింది. సర్వేంద్రియాల్లో ప్రధానమైన నేత్రాలను హరిప్రియ సరికొత్త చూపుతో దర్శించింది. ”పెదవి దాటని మాటలెన్నింటినో / బయటపెట్టే మాధ్యమాలు / గుండె లోతుల్లో దాచుకున్న ప్రేమని/ పరిమళించే సంకేతాలు/ ఎడతీరని బాధను కడతేర్చే క్రమంలో/ కన్నీటి వర్షపు జల్లులు కురిపించే విశాల మేఘాలు” అంటూ నిశితమైన భావ గరిమతో నాయనాలను ప్రతిభావంతంగా అభివర్ణించింది. ”చితి మంటలపై చిరునవ్వు కురిపించే శాంతి స్వరూపం నీవు సేవలో కన్న తల్లివై/, వైద్యశాలకు మూలస్తంభమై/ సర్వ రోగాలను బాగు చేసే ప్రేమ ఔషధం నీవు” అంటూ ‘నర్సు త్యాగనిరతి’ని కవిత్వంలో ఉన్నతీ కరించింది. రోగార్తుల గుండెల్లో ప్రేమ వర్షం కురిపించే నర్సు సేవా నిరతిని ‘శ్వేత పావురం’ అనే కవితలో ఆర్ద్రంగా కొనియాడింది ”ఆకు పచ్చని చీర కట్టుకున్న నిండు ముత్తైదువ నా దేశం/ నీలి రంగు సెలయేరై పరుగులు తీసే పసిపాప నా దేశం” అంటూ ఉదాత్తంగా మాతదేశాన్ని కీర్తించింది.
”ఒక విప్లవం నా దేశం/ ఒక వీరత్వం నా దేశం/ ఒక సాహసం నా దేశం” అంటూ జాతీయోద్యమ కవిలా దేశ చారిత్రక వైభవాన్ని వర్ణిస్తూనే, దేశంలో జరుగుతున్న అవాంఛనీయ ధోరణులను కూడా సునిశితంగా విమర్శించింది.
”నా దేశ కీర్తికి తల మీద కిరీటం నేను/ బహుళ సంస్కతులను దేవించే మాహామాత నేను/ ప్రపంచంలోనే అతి పెద్ద రాజనీతి సారం నేను/ దేశ ప్రజల భుజాలపైనున్న కర్తవ్యం నేను/ రాజ్యాంగ నైతికతను తెలుసుకొని/ కుల మతాలను మరచి/ మానవత్వాన్ని గెలిపించండి’ దేశ పౌరులందరికీ శిరోధార్యమైన దేశ రాజ్యాంగమే సంభాషిస్తున్నట్లు సాగిన కవితతో రాజ్యాంగ నైతికత ను కాపాడాలని హరిప్రియ పిలుపునిస్తుంది. ఈ పిలుపు దిశగా తమ కార్యాచరణను మలుచుకున్న వారే నిజమైన దేశ భక్తులని సమున్నత ఎరుకతో హరిప్రియ నిర్దేశిస్తుంది. హరిప్రియ కవిత్వం రాజ్యాంగ నైతికతను వాగ్దానం చేస్తుంది. ఈ ‘తొలి ఉషస్సు’ సంపుటిలో ‘నేను పిలవని అతిథి’ అనే కవిత హరిప్రియ కవన గరిమకు తార్కాణంగా నిలుస్తుంది. ”పిలవకుండానే ప్రతి నెలా వచ్చి పలకరిస్తావు /వచ్చే రాగానే నన్ను మలిన పరుస్తావు/ నాకు జీవం పోసే ప్రాణానికి నువ్వే మూలం / నీ తొలి పరిచయం నన్ను నాకు అమ్మాయిగా గుర్తు చేస్తే/ నీ నుండి నాకు దొరికిన విరామం నన్ను అమ్మను చేస్తుంది’ ప్రతి నెలలో స్త్రీ అనుభవించే సహజ సిద్ధమైన శారీరక బాధను, మానసికమైన మౌన వేదనను ఆర్ద్రంగా అభివ్యక్తీక రించడంతో పాటు ఆ, వేదనా విరామంలో నుండి మాతత్వం పురుడు పోసుకుంటుందనే తాత్విక భావనను హరిప్రియ అద్భుతమైన కవితగా మలిచింది. హరిప్రియ కవిత్వంలో వస్తు వైవిధ్యం ఉంది. కవితా రూపం పట్ల హరిప్రియ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది. హరిప్రియ తెలుగులోనే కాదు ఆంగ్లంలో కూడా కవిత్వం రాస్తుంది. ఇప్పుడిప్పుడే కథలు కూడా రాస్తుంది. ప్రభుత్వ సిటీ కళాశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ విద్యా మాహా వక్షం నీడలో కవయిత్రిగా మారిన హరిప్రియ కవితా సంపుటిని’ శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు ప్రచురించడం హరిప్రియ అదష్టం.
”నా తరుణ కావ్యలతికలా నాడు పైకి
ప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి లేత రేకులకు కెంజాయ లద్ది
మించు పందిళ్ల పైకి పాకించినావు” అని సి. నారాయణ రెడ్డి తనకు దాశరథి ఇచ్చిన ప్రోత్సాహాన్ని కతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నారు. మళ్లీ ఈ రకమైన గొప్ప ప్రోత్సాహాన్ని సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు కొత్త తరం సాహితీవేత్తలకు అందిస్తూ వ్యయ ప్రయాసలకోర్చి వారి తొలి పుస్తకాలను ముద్రించటం ఎంతో అభినందనీయం. నవయువ రచయిత్రుల్లో చిగురిస్తున్న భావ లతలకు ఈ ట్రస్టు చలువ పందిళ్ళు వేస్తుంది. ‘తొలి ఉషస్సు’ తో సమకాలీన సాహిత్యంలోకి అడుగు పెడుతున్న హరిప్రియకు శుభ స్వాగతం. అభినందనలు.
– డా కోయి కోటేశ్వరరావు, 9440480274