నలుగురిలో ఉన్నప్పుడు కాదు ఒక్కరిగా ఉన్నప్పుడుండేదే నిజమైన ప్రవర్తన. అదే మీరేంటో తెలియజేస్తుంది. అదే నిన్ను నిన్నుగా నిలబెడుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగలిగే శక్తినిస్తుంది. క్లిష్టపరిస్థితులు వచ్చినప్పుడు తప్పించుకుని పారిపోకుండా ఎంత కష్టమైనదానినైనా ఇష్టంగా పూర్తి చేస్తారు. మరి అలాంటి ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది. దాన్ని మనలో నింపుకునేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం…
మనిషికి మొదట కావాల్సింది ఆత్మగౌరవం. తనను తాను ప్రేమించుకోలేనివారు, గౌరవించుకోలేనివారు ఇతరులను గౌరవించలేరు. ప్రేమించనూ లేరు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ మీద మీరు గౌరవం పెంచుకోవడం చేయండి. నేను అందరికంటే తక్కువ అనే భావనను తీసేయండి.
ఎలాంటి పరిస్థితుల్లోనయినా ఆశావాహ దృక్పథంతో ఉండాలి. రాదు.. చేయలేను.. అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అధిగమించే సమయంలో అనేక సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అది సఫలం అవ్వొచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ అనుభవం మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్‌లో మరెన్నో విజయాలకు బాటలు వేస్తుంది.
ఒక్కోసారి నేనేమీ చేయలేనేమో అనిపిస్తుంది. అలాంటి మానసిక పరిస్థితిలో మంచి మోటివేషనల్ సినిమాలు చూడటమో, విజయగాథలను చదవడమో చేయాలి. ఎన్నో సక్సెస్‌లు సాధించిన ఇతరులతో పోల్చుకోవాలి. వాళ్లేమీ అన్నీ పుట్టుకతోనే నేర్చుకోలేదు. సాధనతోనే సాధ్యమయ్యాయి. కాబట్టి ఏదో ఒకరోజు విజయం మన సొంతమవుతుంది. పుస్తకాలు చదవడం, మంచి సినిమాలు చూడటం వల్ల నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఆ ప్రేరణను అప్పటి వరకే పరిమితం చేయకుండా కొనసాగించాలి.
ఏదయినా పని మొదలు పెట్టేముందు దగ్గరి వారితో షేర్ చేసుకోండి. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ ఆనందాన్ని పంచుకోండి. ఆ ప్రోత్సాహం మిమ్మల్ని మరిన్ని అడుగులు వేసేలా చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.