– అశ్వారావుపేట లో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు…
– జూన్ 14 నుండి 16 వరకు నిర్వాహణకు ఏర్పాట్లు…
– ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి…
– రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
అఖిల భారత కిసాన్ సభ అనుబంధ సంఘం తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో జిల్లా కమిటీ నేతృత్వంలో జూన్ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు అశ్వారావుపేట లో వ్యవసాయ రంగం లోతుపాతులు – ప్రభుత్వ విధానాలు రైతులకు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని,వీటి తరగతులు విజయవంతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఈ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య సంఘం శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి దేశంలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్ సంస్థలకు అప్ప జెప్పే చర్యలకు పూనుకుంది అని ఎద్దేవా చేసారు.దీనికోసం వ్యవసాయ సంస్కరణల పేరుతో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల వలన భారత రైతాంగం వ్యవసాయం నుండి వేరు చేయబడే పరిస్థితి వచ్చింది వాపోయారు.ఈ దివాలా కోరు విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సభ (ఎ.ఐ.కె.ఎస్) నేతృత్వంలో 506 సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా 13 నెలల పాటు వీరోచితంగా పోరాటాన్ని కొనసాగించింది అని,ఈ పోరాటంలో 730 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు అని విచారం వ్యక్తం చేసారు.బిజెపి మంత్రులు,ఎంపీలు నోటికి వచ్చినట్టు మాట్లాడి పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు అని గుర్తు చేసారు.కానీ రైతాంగం ఐక్యంగా జరిపిన ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దాని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెడలు వంచి భారత రైతాంగానికి క్షమాపణ కోరాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో భారత రైతాంగం ప్రభుత్వంపైన ప్రజాస్వామ్య పద్ధతిలో సుదీర్ఘంగా పోరాడి విజయం సాధించిన గొప్ప పోరాటం ఢిల్లీ రైతాంగ పోరాటం అని కొనియాడారు.ఇటువంటి గొప్ప పోరాటానికి, విజయానికి కీలక పాత్ర పోషించింది అఖిల భారత కిసాన్ సభ ఏ నని,ఆ పోరాట అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కొరకు రైతాంగం పక్షాన నికరంగా నిలిచి పోరాడుతున్నది అఖిల భారత కిసాన్ సభ అని పునరుద్ఘాటించారు. విద్యుత్ చట్టం సవరణ పేరుతో మరో నయవంచనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.పార్లమెంట్లో తనకున్న అధికార మంది బలాన్ని ఉపయోగించుకొని దొడ్డిదారిన విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకురావడానికి చర్యలకు పూనుకుంటుంది అని విమర్శించారు.కనీస మద్దతు ధర కోసం రైతులు అనేక సంవత్సరాలుగా పోరాడుతుంటే పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.దీనిపై రైతాంగాన్ని సమీకరించి మరో పోరాటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది అని అన్నారు. రైతు రుణమాఫీ పేరుతో అనేక సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ వస్తుంది అని,ప్రస్తుతం లక్ష రూపాయలు వరకు రుణాలు రద్దు అని ప్రకటించినప్పటికీ 50,000 లోపు రుణాలు కూడా రద్దు కాలేదు, దాంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకునే పరిస్థితి లేదు దీంతో బయట ప్రైవేటు అప్పులు కు పోయి రైతులు అప్పుచేసి ఋణ గ్రస్తులు గా మారుతున్న పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేసారు.ఒకే దఫా రుణాలు రద్దు విషయంలో ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం అవుతుందే తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు అని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అప్పులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలిపారు. రైతు బంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలు మొత్తం రద్దుచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవారికి వరకే పరిమితం చేశారు అన్నారు. దానితో ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది మందికి మాత్రమే రైతు బంధు,రైతు బీమా వస్తున్న పరిస్థితి ఉంది అని తెలిపారు. భూ సమస్యలను పరిష్కారానికి ధరణి విధానం తో రైతాంగం మరింత సమస్యల వలయంలో చిక్కుకున్నారు వివరించారు. ధరణి సమస్యలని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది అని అన్నారు.అదేవిధంగా పొడు సాగుదారులకి పట్టా హక్కు ఇస్తామని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రభుత్వం నేటికీ అమలు చేయడం లేదని,పైగా ఫారెస్ట్, పోలీస్ అధికారాన్ని ఉపయోగించి పోడు సాగుదారుల పై విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు అని తెలిపారు. పోడు భూమి నుండి సాగుదారుల్ని వేరు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అని గుర్తు చేసారు. పోడు పట్టాలు గాని పొజిషన్ సర్టిఫికెట్లు గాని ఇవ్వకుండా సాగుదారుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది అన్నారు.ప్రతి సంవత్సరం వానకాల పంట ప్రణాళికను మే 15 వరకు ప్రకటించాల్సిన ప్రభుత్వం నేటి వరకు ప్రకటించడం లేదు అని, దానివలన రైతాంగం పంటలు విషయంలో అయోమయానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది తెలిపారు. అకాల వర్షాలకి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించి రెండు నెలలు అవుతున్న నేటికి నష్టపరిహారాన్ని అందించనటువంటి స్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా ధాన్యం,పత్తి, పామాయిల్, జమాయిలు, మిర్చి వంటి పంటలు ఎక్కువ సంఖ్యలో పండిస్తున్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులను బట్టి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు అవగాహన చేసి పంటల దిగుబడికి సహకరించాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిపైనా ఇప్పటికే దశలవారీగా పోరాటాల్ని కొనసాగించింది తెలంగాణ రైతు సంఘం రాష్ట్రంలో పోడు, ధరణి, రైతు బంధు, బీమా, రుణమాఫీ, కొత్త రుణాలు, ధాన్యం కొనుగోలు అవకతవకలు వంటి సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో రైతాంగాన్ని సమీకరించి పోరాటాలు కొన సాగించ వలసిన అవసరం ఉంది అన్నారు. ఈ శిక్షణా తరగతులకు ఎ.ఐ.కె.ఎస్ జాతీయ కార్యదర్శి విజ్జు క్రిష్ణన్ తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాగర్,పోతినేని సుదర్శన్ రావు, రైతులు సమస్యలు సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తున్న జూలకంటి రంగారెడ్డి,నంద్యాల నర్సింహా రెడ్డి,సారంపల్లి మల్లారెడ్డి లు హాజరు అవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సంతపురి చెన్నారావు,తగరం జగన్నాధంలు పాల్గొన్నారు.