‘ప్రపంచ పైకప్పు’కు చేరింది

Reached the 'Roof of the World'లింగపరమైన అడ్డంకులను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా చెప్పుకునే సియాచిన్‌లో మొహరించిన మొదటి మహిళా వైద్య అధికారిగా కెప్టెన్‌ గీతికా కౌల్‌ నిలిచారు. సియాచిన్‌ యుద్ధ పాఠశాలలో కఠినమైన ఇండక్షన్‌ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రదేశాన్ని ‘ప్రపంచపు పైకప్పు’ అని పిలుస్తుంటారు. ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులకు నిలయం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆమె అక్కడికి చేరడం ఎందరికో స్ఫూర్తిదాయకం.

స్నో లిపర్డ్‌ దళానికి చెందిన కెప్టెన్‌ గీతికా కౌల్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో సేవలందించిన భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా చారిత్రక ఘనత సాధించింది. ఇది హిమాలయాలకు ఉత్తర ప్రాంతంలో ఉంది. సియాచిన్‌ బాటిల్‌ స్కూల్లో అత్యంత కష్టంతో కూడిన ఇండక్షన్‌ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ ఘనత సాధించింది. ఇప్పుడు అక్కడే ఆమె నియమించబడి తన విధులు నిర్వర్తిస్తుంది. ఈ కఠోర శిక్షణ శారీరక, మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అత్యంత ఎత్తులో ఉన్న సియాచిన్‌లోని కష్టమైన వాతావరణ పరిస్థితులలో మనుగడ అత్యంత కష్టంతో కూడుకున్నది. అక్కడ జీవించాలంటే మానసికంగా, శారీరకంగా మనిషి సిద్ధపడి ఉండాలి. అలాగే నిర్దిష్ట వైద్య పద్ధతులపై కూడా అవగాహన తప్పనిసరి.
సగర్వంగా ప్రకటించింది
గీతికా సాధించిన ఈ విజయాన్ని ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ సోషల్‌ మీడియాలో సగర్వంగా ప్రకటించింది. అసాధారణ మైన విజయంగా దీన్ని గుర్తించి సైన్యంలో మహిళలు చేరేవిధంగా ప్రోత్సహించడంలో గీతికా చేరిన మైలురాయి ఎంతో దోహద పడుతుందని నొక్కి చెప్పింది. ఎటువంటి కఠినమైన పరిస్థితులనైనా మహిళలు ఎదుర్కోగలరు అని ఆమె చేసింది. తరతరాలుగా పురుషులు ఆధిపత్యం వహించే పాత్రలలో మహిళలు కూడా రాణించగలరు అని ఆమె నిరూపించింది.
ప్రాణాలను సైతం పణంగా పెట్టి
తాను సాధించిన ఈ ఘనతపై కెప్టెన్‌ గీతిక సంతోషం వ్యక్తం చేసింది. దీంతో పాటు దేశానికి సేవ చేసేందుకు తనను ఎంపిక చేసి ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచిన భారత సైన్యానికి కతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం ప్రతి కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతానని ఆమె తెలిపింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ సోషల్‌ మీడియాలో తన చిత్రంతో పాటు ఆమె ఈ విషయాలను మనతో పంచుకుంది.
ముఖ్యమైన ప్రాంతం
సియాచిన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి మాత్రమే కాదు ఇది భారతదేశానికి, పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైనది. ఇది హిమాలయాలలోని కారకోరం శ్రేణి తూర్పు భాగంలో సముద్ర మట్టానికి దాదాపు 5753 మీటర్ల ఎత్తులో అంటే 20 వేల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ యుద్ధభూమి నుండి భారత ఆర్మీ సైనికులు లేV్‌ా, లడఖ్‌, చైనాలపై నిఘా ఉంచుతారు. సియాచిన్‌లో దాదాపు పదివేల మంది సైనికులు నిత్యం మోహరించి వుంటారు. ఇక్కడ పాదరసం ఎప్పుడూ మైనస్‌లోనే ఉంటుంది. భారత సైన్యం 1984లో సియాచిన్‌లో తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రాంతంలో మోహరించిన సైనికులకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయి. శత్రువుల నుండి దేశ సరిహద్దులను రక్షించడానికి భారత ఆర్మీ సైనికులు ఇక్కడ నిత్యం మంచు కలిసి జీవిస్తుంటారు.
మొబైల్‌ కమ్యూనికేషన్‌
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌, కొత్త బేస్‌ ట్రాన్స్‌సీవర్‌ స్టేషన్‌ని ఏర్పాటు చేసి సియాచిన్‌లో నివసించే సైనికులకు కమ్యూనికేషన్‌ మద్దతును మెరుగుపరిచింది. సియాచిన్‌ వారియర్స్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయత్నం 15,500 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు మొబైల్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందించడానికి రూపొందించబడింది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో పని చేసే సైనికులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండేది కాదు. బీఎస్‌ఎన్‌ల్‌ చేసిన ఈ కృషి ప్రపంచంలోని అత్యంత విపరీతమైన, ఎత్తైన యుద్ధభూమిలో సేవ చేస్తున్నప్పుడు వారి కుటుంబాలతో సన్నిహితంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది.