మత్స్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయండి

– జిల్లాకు రెండు చేప, రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మత్స్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లాకూ రెండు చొప్పున చేప/ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధి కోసం 2017, జులై ఐదున జీవో నెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. దాని ప్రకారం మెరిట్‌ ఆధారంగా 29 మంది ఫిషరీస్‌ ఫీల్డ్‌ ఆఫీసర్లు, 73మంది ఫిషరీస్‌ అసిస్టెంట్లు, 75 మంది ఫిషర్‌మెన్స్‌, 15మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు మొత్తం 193 మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించారని వివరించారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధి, మత్య్స కారుల సంక్షేమం, ఉచిత చేప/ రొయ్య పిల్లల పంపిణీ, సమీకృత మత్స్య అభివృద్ధి, బీఆర్‌ఎస్‌, పీఎంఎంఎస్‌వై లాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో సీఎం కృషి కీలకమని తెలిపారు. మత్స్య సంపదను పెంచి అనేక రాష్ట్రాలకు, దేశాలకు అందించడంలో ఆయన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలంటూ చాలాసార్లు సంబంధిత మంత్రి, కమిష నర్‌ను కలిసి విన్నవించారని గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు వారు పూనుకు న్నారని తెలిపారు. అందువల్ల మత్స్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలనీ, ఈ శాఖలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను అవసరాలకను గుణంగా మరింతగా పెంచాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విస్తారం గా వర్షాలు కురిసి, జల వనరులు అభివృద్ధి అయిన నేపథ్యంలో ప్రతి జిల్లాలో నీటి ప్రాజెక్టుల పక్కన చేప/ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్మించాలని కోరారు.