నవతెలంగాణ-హైదరాబాద్ : వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.