అతడు నల్లని ఆకాశంపై
తెల్ల తెల్లని అక్షరాల్ని పొదిగి
లోచూపును అందించే రెటినాపై
జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు..!
అతడు వేలు పట్టుకుని
అంశాల వారీగా పాఠాలలోని
చిక్కు ముడులన్ని విప్పి
అధ్యయనాన్ని సమతలం చేస్తాడు..!
అతడు పుస్తకాలలో దాగిన
లెక్కల కూడిక తీసివేతలతో
అంతర్లీనమైన గుణపాఠాలను నేర్పి
నిన్ను మహోన్నతానికై సిద్ధం చేస్తాడు..!
అతడు చనువుతో నేర్పిన పాట
నీలో సంగీతమై ప్రతిధ్వనించినపుడు
సుస్వరాల మధురిమను స్వాగతిస్తూ
పూల వనాన్ని నీలో సష్టిస్తాడు..!
అతడు నీవు చేసిన
ప్రయత్నాలలో గెలిచినా ఓడినా
నీ లక్ష్యాల వెంటే ఉంటూ
నీ పోరాట స్ఫూర్తికి ఉప్పందిస్తాడు ..!
అతడు కొన్ని తరాల తలరాతలను
తన మేధస్సుతో లిఖించి
జీవనదిలా ఎన్నో పుష్కాలకు సిద్ధమై
నీ వ్యక్తిత్వంలో పునీతమవుతాడు..!
– డా|| వాసాల వరప్రసాద్