ఆధునిక పోలీస్‌ వ్యవస్థతో సురక్ష తెలంగాణ

– తెలంగాణ సురక్షా దినోత్సవంలో ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌
– పోలీసు వాహన ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే
– శంషాబాద్‌ నుంచి షాద్‌ నగర్‌ వరకు ర్యాలీ
నవతెలంగాణ-శంషాబాద్‌
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆధునిక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టీ. ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్‌ హైవే 44 పై నుంచి షాద్‌ నగర్‌ వరకు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలీసు వాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థను తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుకే దక్కుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు, పోలీసులకు మధ్య వ్యత్యాసం తగ్గిందన్నారు. కరోనా కష్టకాలంలో పోలీసులు తీసుకున్న సాహసోపేతమైన కఠిన చర్యలను వారి సేవలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక పోలీసు వ్యవస్థను రూపుదిద్దడంలో భాగంగా నూతన వాహనాలను, మొబైల్‌ వాహనాలను, సాంకేతిక పరిజ్ఞానం పోలీస్‌ వ్యవస్థకు అందించారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్రను గుర్తించి సురక్ష దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ దేశంలోని అత్యంత ఆధునిక వ్యవస్థగా మారిందన్నారు. 10 లక్షలకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీసుల త్యాగం కృషీ వల్ల సుస్థిర సురక్ష శాంతి ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఉత్సవాల్లో భాగంగా 400 డ్రోన్‌ కెమెరాల ప్రదర్శన జరుగుతున్నదన్నారు. నేరాల అదుపులో గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ కీలక పోలీస్‌ విభాగాలు కృషి చేయడం వల్ల నేరాల శాతం చాలా తగ్గిందన్నారు. పోలీసు చర్యలు, సాంకేతికత కారణంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. అందువల్లనే తెలంగాణలో బహుళ జాతి కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఏ రంగంలో చూసిన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ముందుకు దూసుకు వెళ్తుందని దానికి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడం వల్లనే సాధ్యమైందన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సఖ్యతను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కే . సుష్మ మహేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌ యాదవ్‌, జడ్పిటిసి నీరటి తన్విరాజు, వైసీపీ నీలం మోహన్‌, ఏఎంసీ చైర్మన్‌ దూడల వెంకటేష్‌ గౌడ్‌, శంషాబాద్‌ ఆర్‌.జి.ఐ.ఏ పి.ఎస్‌ , షాద్‌ నగర్‌ పిఎస్‌ ఏసీపీలు వి. భాస్కర్‌ , కుశాల్కర్‌, సీఐలు ఆర్‌.శ్రీనివాస్‌, ఏ. శ్రీధర్‌ కుమార్‌, రామకృష్ణ, మహేష్‌, సత్యనారాయణ, నవీన్‌ కుమార్‌, ఎస్‌ఐలు బి. సుమన్‌, బాల్‌ రాజ్‌, డి శ్రీనివాస్‌, ఆర్‌.గణేష్‌ గుప్తా, మేకల వెంకటేష్‌, పారేపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.