నవతెలంగాణ- ఖమ్మం
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు. రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు నాణ్యత ప్రమాణాలను పాటించేలా మంగళవారం నగరంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు, డీలర్లతో ప్రత్యేక సమావేశం బడ్జెట్ హౌటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు. అధీకృత విత్తన, ఎరువుల డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన విత్తనాలను విక్రయించాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని తెలిపారు. రైతులకు మేలు కలిగించే రీతిలో నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు వ్యవసాయ, పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఇప్పటికే గడువు తీరిన, నాసిరకం విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి పెట్టిన అధికారులు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాల స్టాక్ రిజిస్ట్రర్లు, ఎరువులు, పురుగుల మందుల స్టాక్ వివరాలతో పాటు ఆయా కంపెనీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విత్తనాలు , ఎరువులు ఎక్కడ నుండి దిగుమతి చేస్తున్నారనేది తెలుసుకుంటున్నారని అన్నారు. రైతులు కూడా కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను నమ్మి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయరాదని, వ్యవసాయశాఖ ధ్రువీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైన విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో సిఐలు సత్యనారాయణ, స్వామి, శ్రీహరి, ఫర్టిలైజర్ దుకాణాల అధ్యక్షుడు నాగేందర్, మనోహార్ పాల్గొన్నారు.
పెనుబల్లి: పెనుబల్లి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పురుగుమందుల దుకాణం దారులు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి పెనుబల్లి ఎస్సై సూరజ్, వ్యవసాయ అధికారి ప్రసాద్ రాజు హాజరై విత్తనాల కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన కల్పించారు.
వైరా : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై పిడి యాక్ట్‌తో పాటు కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు హెచ్చరించారు. మంగళవారం వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయశాఖ, పోలీస్, విత్తన డీలర్ల సదస్సులో బాబురావు మాట్లాడారు. సదస్సులో వ్యవసాయశాఖ ఏడి బాబురావు, కెవికె కోఆర్డినేటర్ హేమంతరావు, సీఐ సురేష్ మాట్లాడారు. రాబోయే వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిన విత్తనాలు, ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్లోని వ్యవసాయ శాఖ అధికారులు, సీఐ సురేష్ , పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, విత్తన డీలర్లు పాల్గొన్నారు
కల్లూరు : గ్రామాల్లో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మినా, గడువు ముగిసిన విత్తనాలు అమ్మినా వెంటనే తమకు సమాచారం ఇస్తే చర్య తీసుకుంటామని ఎస్సై రఘు అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో నకిలీ కల్తీ విత్తనాలు పట్ల డీలర్లకు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ఏవో ఎం రూప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విత్తనాలమ్మే డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
కామేపల్లి : నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని జేడీఎ విజయనిర్మల అన్నారు. కామేపల్లి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కామేపల్లి మండలంలో రైతులు మోసపోవద్దని, దళారులను నమ్మి నకిలీ విత్తనాలు కొనవద్దని, నాణ్యమైన విత్తనాలను లైసెన్సు ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనాలని విస్తృతంగా ఆటోతో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార జాతను ఖమ్మం వ్యవసాయశాఖ జేడిఎ విజయనిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాలు కొనవద్దని లైసెన్స్ ఉన్న దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలను కొని అధిక దిగుబడిని సాధించి రైతే రారాజు కావాలని కోరారు. కార్యక్రమంలో సరిత కామేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి బి తారాదేవి మండల పరిధిలోని సర్పంచులు, ఎఇఒలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.