పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నమాట ఆమె నిజం చేసింది. నిండా పాతి కేండ్లు లేని ఆమె కుంచెలోని కౌశలం, కలంలోని పరిణతి సీనియర్ కళా కారులను, కవులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెన్సిల్ ఆర్ట్, వాటర్ పేంట్, కార్టూన్స్, సృజనాత్మకమైన ఫొటోగ్రఫీ ఆమెకు అలవోకగా అలవాడిందా, ఏకసంధాగ్రాహిత్వం చిత్రకళకు కూడా వర్తిస్తుందా అనే ఆశ్చర్యం కలుగక మానదు పి. సుష్మను చూస్తే. నగరానికి దూరంగా వ్యవసాయం తప్ప ఇతరేతరాలు తెలియని కుటుంబం నుండి రసాయన శాస్త్రం చదవడం ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ కరాన్ని సునిశిత కార్యానికి ఉపయోగిం చగల ఆమె నేర్పు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడితో ఆగకుండా కవిత్వంలో కొత్త ఊహలను అందిపుచ్చుకొని రాస్తున్నది. అది కూడా భావ లోకంలో విహరిస్తూ అసలు లోకాన్ని మరిచే భ్రమల కవిలా కాదు, నిరంతరం సామాన్యుల చుట్టూ తిరిగే బాధ్యతా యుతమైన ఆ కవయిత్రి పరిచయం ఆమె మాటల్లోనే…
మాది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సోమేశ్వర బండలో మధ్యతరగతి కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న పర మేశ్వరరెడ్డి. ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తు న్నాను. నాకు వచన కవిత్వం, మినీ కవితలు, నానీలు, వ్యాసాలు రాయడం తో పాటు కార్టూన్స్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వార్త, నవతెలంగాణ, హాస్య నందం, తెలుగువన్, నవమల్లె తీగ మ్యాగజైన్స్‌లో నా కార్టూన్స్ ప్రచురితమైనవి. ఉక్రెయిన్, రష్యా వార్ సందర్భంగా ఇండియన్ టోన్స్ (×అసఱaఅ ుశీశీఅర) వారు నిర్వహిం చిన ఇంటర్నేషనల్ కార్టున్ ఎగ్జిబిషన్‌లో నా కార్టూన్ ఉత్తమమైన కార్టూన్‌గా ఎంపికైంది. వివిధ సంస్థలు నిర్వహించిన పుస్తకాలలోనూ నా కార్టూన్స్, క్యారికేచర్స్ ప్రచురించబడ్డాయి.
కవిత్వంతోనే సాంత్వన
పదవ తరగతిలో ఉన్నప్పటి నుండే చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని. ఇంటర్మీడియట్ హాస్టల్లో చేరాను. ఇంటికి దూరంగా ఉన్న నాకు కవితలు రాయడం ద్వారానే సాంత్వన దొరికేది. నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు మొదట్లో మోటివేషనల్ పోయెమ్స్ రాసేదాన్ని. నన్నే కాదు మా మిత్రులను మోటివేట్ చేయడానికి కూడా ఆ కవితలు చాలా దోహదపడేవి. అప్పుడే అక్షరానికి ఉన్న బలం నాకు అర్థమయింది. దాంతో నలుగురి కోసం కవిత్వం రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అయితే రాసిన కవితలను పుస్తకం లో దాచుకునేదాన్ని. ఒకసారి మా ఆర్బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజి మ్యాగజైన్‌లో నా తొలి కవిత ప్రచురిత మయింది. ఆ తర్వాత సర్వేపల్లి సురేష్ కుమార్ ద్వారా ఎంతో మంది కవులు పరిచయమయ్యారు.
రాయగలననే నమ్మకం…
కరోనా సమయంలో ఓ తెలుగు పత్రిక వారు నిర్వహిస్తున్న కరోనాపై కథనం పోటీకి కవిత పంపాను. ఆ కవిత బహుమతికి ఎంపిక కావడమే కాదు వారం రోజుల వరకు నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అయితే అన్ని ఉదయాలు ఒకేలా ఉండవు బహుమతి వచ్చిందన్న ఆనందం కంటే నేనూ కూడా రాయగలననే సంతోషం నాలో నమ్మకాన్ని కలిగించింది. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే సామాజిక సమరసతా వేదిక నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతిని మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేతుల మీదుగా అందుకోవడం మర్చిపో లేని మరో జ్ఞాపకం. బహుమతులు ప్రతి భకు కొలమానం కాదు కానీ ప్రోత్సాహాం నమ్మకం కలిగిస్తాయి. అలా చాలా కవితలు రాయగలిగాను. ఈనాడు, సాహితీకిరణం, శ్రీశ్రీ కళా వేదిక, గోవిందరాజు సీతాదేవి వేదిక, సూరేపల్లి రాములమ్మ, మల్లెతీగ మాసపత్రిక, నవభారత నిర్మాణ సంఘం, కళపత్రిక, తానా బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం, తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మొదలయిన వారు వివిధ సందర్భాల్లో నిర్వహించిన కవితల పోటీలో ఎన్నో బహుమతులు వచ్చాయి.
గళం విప్పి గర్జిస్తేనే…
సూక్ష్మంగా పరిశీలిస్తే సమాధానం లేని సవాలక్ష ప్రశ్నలు సమాజం నిండా ఉన్నాయి. తరానికి తరానికి మధ్య అభివృద్ధి అపోహలో బతుకుతున్నాం. ఆకలి చావులు ఆగలేదు, అంటరానితనం పోలేదు. ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి, గళానికి ఉంది అని నేను నమ్ముతాను. అందుకే అభ్యుదయ కవిత్వాన్ని రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను. అణచివేతను, నియంతృత్వాన్ని, ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఏ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయి. ఇప్పటి వరకు వచ్చిన మార్పులు సైతం అన్ని కలాలు కలిసి గళం విప్పి గర్జిస్తేనే వచ్చాయి. సాహిత్యానికి, అక్షరానికి అంత శక్తి ఉంది కాబట్టే నేను రాయడానికి అమితంగా ఇష్టపడతాను.
ఆలోచనా ధోరణి మార్చాలనే…
గురజాడ గురించి నేను రాసిన ‘మళ్ళి పుట్టవూ’ కవితకు సినీగేయ రచయిత భువనచంద్ర ప్రశంసలు ఎప్పటికి మరువలేనిది. అన్నింటికంటే ముఖ్యంగా రష్య ఉక్రెయిన్ యుద్ధం సమయంలో శాంతి గీతం కవితకు పాఠకులనుంచి వచ్చిన ప్రశంసలు, ప్రభుత్వ పాలన గురించి నేను రాసిన ‘ఉద్యమించే పద్యం కావాలి’ కవిత ఓ పెద్దమనిషి చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా గుర్తుంది. సాహిత్యం ద్వారా సమాజంలో పూర్తి మార్పు రాలేకపోయినా కనీసం ఆలోచనా ధోరణి మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో నేను కవితలు రాస్తున్నాను. ‘అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న కాళోజి మాట స్ఫూర్తితో నేను కవిత్వం రాస్తున్నాను.
”జీవితానికి జీవితాన్ని తగలేసి
అతను వెళ్ళిపోయాడు
ఎదురుచూపులను వాకిట్లో విసిరేసి
ఆమె వెళ్లిపోయింది
వారసత్వంగా వచ్చిన ఆకలితో
వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు’
– సుష్మ
– బూర్గు గోపికృష్ణ, 7995892410