నవతెలంగాణ- ముంబాయి: ఒక మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజారాంపురి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ఆటో ఎక్కేందుకు రోడ్డు వద్దకు వచ్చారు. మహిళ భర్త ఒక ఆటో డ్రైవర్‌తో రేటు విషయంపై మాట్లాడాడు. రేటు కుదరకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ కూడా ఈ వాగ్వాదంలో జోక్యం చేసుకుంది. కాగా, డ్రైవర్ ఉన్నట్టుండి వేగంగా ఆటో నడిపాడు. అయితే మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. దీంతో ఆమె రోడ్డుపై పడగా ఆ ఆటో ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కేకలు వేస్తూ ఆటోను వెంబడించారు. ఆటోను నిలుపాలని అరిచారు. అయితే అప్పటికే ఆ మహిళను ఆటో సుమారు 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. గాయపడిన ఆ మహిళను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.