తెలంగాణకు మూలధన పెట్టుబడి నిధి రూ.2,102 కోట్లు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56.415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ఈ జాబితాలో చోటు దక్క లేదు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్మెంట్‌’ పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వా లని నిర్ణయించింది. 50 ఏండ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రా లకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంను వైద్యం, నీటిపారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారు లు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా, రాష్ట్రాలు ఉండగా, కేరళ, ఏపి మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బీహార్‌కు రూ.9,640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది.