కర్నాటకలో బీజేపీ ఓటమిని కప్పిపుచ్చేందుకే నోట్ల రదు : కూనంనేని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కర్నాటకలో బీజేపీ ఓటమిని కప్పిపుచ్చేందుకే నోట్ల రద్దును ప్రకటిం చారనీ, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బంధించే కుట్రలో భాగంగానే అకస్మాత్తుగా రూ. 2 వేల నోట్లు రద్దు నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో విమ ర్శించారు. గతంలో యూపీ ఎన్నికల కంటే ముందు ఎస్‌పీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో బలహీన పర్చాలనీ, మరికొన్ని కారణాలతో నాడు పెద్ద నోట్ల రద్ధు నిర్ణయం చేశారని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. తాజాగా రూ.2 వేల రూపాయల నోట్ల రద్ధు నిర్ణయం గతంలో మోడీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగున్నదని పేర్కొన్నారు. కర్నాటకలో బీజేపీ ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే అకస్మాత్తుగా ఆర్‌బీఐ నుండి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. గతంలో పెద్దనోట్లు రద్ధు చేసినప్పుడు నల్లధనం బయటికి వస్తున్నదని, ఉగ్రవాదం, అవినీతి అంతమవుతున్నదని మోడీ బీరాలు పలికారని విమర్శించారు.
ఆ లక్ష్యాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నాడు పెద్దనోట్ల మార్పిడి కోసం దేశ వ్యాపితంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారని గుర్తుచేశారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారనీ, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందనీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారని తెలిపారు. పన్ను ఎగవేతదారులకు, కార్పోరేట్‌, ధనస్వాములకు ఈ నిర్ణయం ఉపయోగపడిరదని పేర్కొన్నారు.ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటాన్ని సీపీఐ రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని తెలిపారు.

Spread the love