ప్రభుత్వాలు మాట తప్పినందునే భూపోరాటం

– పట్టాభూమి జోలికి పేదలు వెళ్లడం లేదు
– ప్రభుత్వ భూమినే పంచాలంటున్నారు : సీపీఐ(ఎం) నేతలు జి.నాగయ్య, ఎస్‌.వీరయ్య

– చెన్నూర్‌ భూపోరాటానికి మద్దతు
నవతెలంగాణ-జైపూర్‌
ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతోనే పేదలు భూపోరాట మార్గాన్ని ఎంచుకున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం బావురావుపేట్‌ శివారుల్లో ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు ఎర్రజెండా
అండగా నిల్చిందని చెప్పారు. శుక్రవారం వారు భూపోరాట ప్రాంతాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పేదలు నాయకులకు స్వాగతం పలికి తాము గుడిసెలు వేసుకున్న స్థలం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో నాగయ్య, వీరయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు నిలువ నీడ లేని పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బావురావుపేట్‌లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు భూపోరాటం చేస్తున్నారని చెప్పారు. బావురావుపేట్‌ శివారులో 27 రోజులుగా ఇండ్ల స్థలాల కోసం పేద కుటుంబాలకు చెందిన మహిళలు వీరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసుల లాఠీలకు వెరవకుండా పేదలు గుడిసెలు వేసుకుని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా జక్కలొద్దిలో 2022 మే 22న ప్రారంభమైన భూపోరాటం రాష్ట్రమంతటా విస్తరించిందని వివరించారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిన పీఎం మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. పేదలు పట్టా భూముల జోలికి పోవడం లేదని, ప్రభుత్వ భూములే పంచాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్‌కు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అడగక ముందే అన్నీ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ పేదలకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని విమర్శించారు. పేద కుటుంబాలకు 3ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. బావురావుపేట్‌లో ఎప్పుడో 40ఎండ్ల కింద ఎవరికో ఇచ్చిన భూమి, దాన్ని తీసుకున్న వారెవ్వరూ ఇప్పుడు లేరని తెలిపారు. బడాబాబులు ఈ భూమి ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 58 ద్వారా ఈ భూమిలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.3లక్షలకు బదులుగా రూ.5లక్షలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి స్థలం దక్కే వరకూ ఇక్కడి నుంచి కదలొద్దని, సీపీఐ(ఎం) అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Spread the love