ఆపదలో ఆదుకునే కందాళను గెలిపించాలి

– ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాలి
– మాజీ మంత్రి సంభాని
నవతెలంగాణ -కూసుమంచి
బిఆర్‌ఎస్‌ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి మనస్సున్న వ్యక్తి అని, ఆపదలో ఆదుకునే వ్యక్తి అని, ఇలాంటి నాయకుడు దొరకడం పాలేరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని, గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం మండలంలోని జుజ్జుల్‌రావుపేట, వాల్యా తండా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్‌ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్‌ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయలకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్‌ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కావున ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ చంద్రావతి, జడ్పిటిసి ఇంటర్‌ బేబీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తాళ్లూరి జీవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.