వడగండ్ల బాధితులకు పరిహారం ఇవ్వకుంటే ఆందోళన తప్పదు

వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి మూడు నెలలు గడిచినా అందని పరిహారం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మధుసూదన్‌రెడ్డి
అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-యాచారం
వడగండ్ల బాధితులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే ఆందోళన తప్పదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మధుసూదన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం యాచారం మండల పరిధిలోని మంతన్‌ గౌరెల్లి సీపీఐ(ఎం) గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వడగండంల బాధితులకు పరిహారం ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 16న కురిసిన వడగండ్ల వానతో గ్రామంలో 600కు పైగా ఇండ్లకు చిల్లులు పడి, ధ్వంసం అయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, అధికారులు పర్యటించి, జరిగిన నష్టంపై ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వడగండ్ల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అకస్మాత్తుగా వర్షాలు పడితే, ఇంట్లో ఎక్కడ తల దాచుకోవాలో బాధితులకు తెలియని పరిస్థితి దాపరిం చిందన్నారు.అంతేకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కుడ తడుస్తాయోనని ఆందోళన చెందుతున్నారని వెల్ల డించారు.నష్టపోయిన పంటలకు, రేకుల ఇండ్ల బాధితులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి, నష్టపోయిన బాధితులందరికీ పరిహారం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో పరిహారం ఇవ్వకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. వడగండ్లతో తీవ్రంగా నష్టపోయిన మంతన్‌ గౌరెల్లి గ్రామస్తులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మండల కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ తావు నాయక్‌, చందు నాయక్‌, అమీర్పేట మల్లేష్‌, గడ్డం కుమార్‌, మంథని, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు నరసింహ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.