ఇల్లు మారేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అద్దె, పరిసరాలు, వసతులు ఇలా చాలానే ఉంటాయి. అన్నీ సరిగా తెలుసుకోకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దామా…
పరిసరాలు…
ఇల్లు మారాలనుకున్నప్పుడు పరిసరాలు చాలా ముఖ్యం. అన్ని వసతులు దగ్గరగా ఉన్నవా లేవా పరిశీలించుకోవాలి. పిల్లల స్కూల్, షాపింగ్, హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ అందుబాటులో ఉంటే ఇబ్బంది ఉండదు. బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా సమస్య అవ్వదు. సమయం కూడా కలిసి వస్తుంది. గ్యాస్, కరెంట్, డ్రైనేజీ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో ముందే చూడాలి. దీని వల్ల ఇంట్లోకి దిగాక కూడా ఎలాంటి సమస్యలు రావు.
సెక్యూరిటీ..
ఇల్లు తీసుకునే ముందు సెక్యూరిటీ ఉందో లేదో పరిశీలించుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ఇంటిని ఎంచుకోవడం మంచిది.
పెంపుడు జంతువులు..
చాలా మంది జంతువుల్ని పెంచుకుంటారు. అలాంటి అలవాటు ఉంటే దాని గురించి ముందుగానే ఓనర్‌కి చెప్పాలి. చుట్టుపక్కల అబ్జెక్షన్ చెప్పేవారున్నారా అని వివరాలు కూడా తెలుసుకోవాలి.
విస్తీర్ణత…
ఇంట్లో ఎన్ని రూములున్నాయి.. అనుకూలంగా ఉన్నాయా లేదా.. అందులో వస్తువులన్నీ సరిపోతాయా లేదా చూసుకోవాలి. అలా కాకుండా చాలీచాలని ఇల్లు తీసుకుంటే మొదట్లో సర్దుకుపోయినా రానురాను ఇబ్బందులు ఎదురవుతాయి. చికాకులు పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఏమైనా పగుళ్ళు ఉన్నాయా.. నాచులు, అచ్చులు ఉన్నాయా అని కూడా చూసుకోవాలి.. ఇవి పరిశీలించుకోకున్నా… సమస్యలు ఎదురవుతాయి.
పార్కింగ్, అగ్రిమెంట్..
పార్కింగ్ ప్లేస్ కూడా చూసుకోవాలి. కారు ఉన్నా, బైక్ ఉన్నా పార్కింగ్ ప్లేస్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇల్లు అగ్రిమెంటు చదివి అర్థమైందనుకున్నాక, అందులోని షరతులు అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే సంతకం పెట్టాలి. లేకపోతే చివరికి నష్టపోవాల్సి వస్తుంది.
మెయింటనెన్స్..
ఇంటికి మెయింటనెన్స్ ఎలా ఉంటుందో వివరాలు ముందే తెలుసుకోవాలి. అది ఎవరు చెల్లిస్తారో, ఎంతెంత ఉంటుందో, అంతకు ముందు ఉత్పన్నమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో లేదో కూడా వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.