– గుంతలు పడిన రోడ్లపై నిలుస్తున్న నీరు
– రూ. కోట్లు వెచ్చించినా పాటించని నాణ్యత ప్రమాణాలు
– అడుగడుగునా అధిóకారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
సీఎం కేసీఆర్ రహదారులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపురం ఫ్లైఓవర్ వద్ద పెద్ద పెద్ద గుంతలు పడటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లు గుంతలు పడి అధ్వాన్నంగా మారాయనీ మున్సిపల్ ప్రజలు విన్నవించుకుంటున్నా, రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇప్పటి వరకు కన్నెత్తి కూడా చూడడం లేదు. అభివృద్ధే ధ్యేయమని చెబుతున్న నాయకులకు, అధికారులకు సమస్యలు విన్నవించుకున్నా తీరు మారడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
నవతెలంగాణ-శంకర్‌పల్లి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత మూడు రోజులు కురుస్తున్న వర్షంతో శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపురం ఫ్లైఓవర్ వద్ద పెద్ద పెద్ద గుంతలు పడటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో వర్షాలు కురవడంతో మూసి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు ఇబ్బంది ఉండేది. దీంతో ట్రాఫిక్‌లో వాహనాలు సుమారు రెండు గంటలు పాటు నిలిచిపోయేవి. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మించినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఉన్న గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో రోడ్లపై గుంతలు పడటంతో చిన్నపాటి వర్షానికే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. చేవెళ్లకు 20 నిమిషాల్లో వెళ్లే బస్సు గంట టైం సమయం పడుతోంది. అదేవిధంగా శంకర్పల్లి ప్రధాన చౌరస్తా నుంచి ఫతేపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకూ రోడ్లన్నీ గుంతలమయమే. చిన్నపాటి వర్షానికే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా కురిస్తే, రోడ్ల పరిస్థితి ఏమిటని పలువరు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్ల రూటు, వికారాబాద్ రూటు, మోమిన్పేట్ రూట్ వెళ్లాలన్న వాహనాదారులు ఏ గుంతల పడిపోతామోనని ప్రాణాల అరచేతుల పట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే ఈ రోడ్లుపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణిస్తునే ఉంటారు.కానీ ఈ రోడ్డును మాత్రం పట్టించుకోరు ఎందుకని స్థానికులు నిలదీస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు గుంతలు పడి, ప్రయాణికులు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. సీఎం కేసీఆర్ రహదారులకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నామంటున్నారే తప్ప, ఇక్కడ మాత్రం అది కనిపించడం లేదు. ఈ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని రెండేండ్ల నుంచి మున్సిపల్ ప్రజలు విన్నవించుకుంటున్నా, రోడ్డు భవనాల శాఖ మంత్రి ఇప్పటివరకు కన్నెత్తి చూడడం లేదనీ పలువురు ఆగ్రహం చెందుతున్నారు. సమస్యలు విన్నవించుకున్నా అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల సమస్య ఈ విధంగా ఉంటే, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని శంకర్పల్లి ప్రధాన చౌరస్తా నుంచి ఫతేపురం ఫ్లైఓవర్ వరకూ రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టి, ప్రజలకు విముక్తి కలిగించాలని వాహనాదారులు, ప్రజలు కోరుతున్నారు.