ఎస్సై గారూ…ఇదేం తీరు..?

– సివిల్‌ మ్యాటర్స్‌లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు
– పలు కేసుల విచారణలో అలసత్వం..
– ప్రశ్నిస్తే బెదిరింపులు
– పోలీస్‌ బాస్‌కు బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-చింతకాని
చింతకాని పోలీసు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. సివిల్‌ మ్యాటర్స్‌ లో తలదూర్చి, భూ వివాదాలలో సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోకుండా.. ఫిర్యాదు చేసిన బాధితులనే తిట్టటం, అసభ్యకరంగా దూషించటం, అవమానించటం లాంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు సోమవారం పలువురు బాదితులు జిల్లా పోలీస్‌ బాస్‌ విష్ణు ఎస్‌ వారుయర్‌ కు పిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మండలంలో పలు భూవివాదాల్లో బాధితులను బెదిరించడం, ఎలాంటి విచారణ లేకుండా భూ సమస్యలపై కేసులు పెట్టడం లాంటి అనైతిక చర్యలకు ఎస్సై పాల్పడుతున్నట్లు బాదితులు వాపోతున్నారు. నామవరం గ్రామానికి చెందిన రైతు పగడాల హరీష్‌ 15 క్వింటాళ్ల మిర్చి దొంగతనం జరిగిందని ఏడాది క్రితం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి.. కాళ్లు అరిగేలా ఆరు నెలల పాటు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగితే కానీ కేసు నమోదు చేశారు. కానీ ఆ కేసు పై నేటి వరకు విచారణ లో ఎలాంటి పురోగతి లేదు. న్యాయం చేయాలని పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన హరీష్‌పై ఎస్సై ఇష్టానుసారంగా మాట్లాడుతూ… నీపైనే కేసు పెడతానని బాధితుడిని బెదిరించడం చర్చనీయాంశం అయింది . చింతకానికి చెందిన దేశబోయిన వెంకటేశ్వర్లు లక్షన్నర విలువ చేసే నాటు కోళ్లు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేసి.. నిందితుడి వివరాలు తెలియచేసినా… సెటిల్మెంట్‌ మీరే చేసుకోండి అని బాధితులకు సూచించినట్లు ఆరోపణలున్నాయి. వందనం, నాగులవంచ గ్రామాల్లో వరుస చైన్‌ స్నాచింగ్లు, దొంగతనాలు జరిగినా వాటిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. వందనం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో భూవివాదాలు, సివిల్‌ కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్సై ఓ వర్గం వారికి కొమ్ముకాసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసింహాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గేదెలు దొంగతనం జరిగిందని ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాదితుడు మండల పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్‌ కు వినతి పత్రం ఇవ్వగా స్పందించిన జిల్లా కలెక్టర్‌ బాదితుడు వెంకటేశ్వర్లు కేసు విచారించాలని ఎండార్స్‌ చేసి ఏడాది గడిచినా నేటి వరకు ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. తాజాగా మండలంలో శాంతిభద్రతలు పట్టించుకోకుండా కేవలం పోలీస్‌ స్టేషన్లో భూదందాలు, సెటిల్మెంట్లు, అక్రమార్కుల వద్ద డబ్బులు తీసుకుని బాధితులకు అన్యాయం చేయటం వంటి సంఘటనలపై పూర్తి విచారణ చేపట్టి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. .తాజాగా శనివారం మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు, సీతయ్య అనే వ్యక్తులను పాత కక్షలు నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బత్తుల ప్రసాద్‌ మరో నలుగురు వ్యక్తులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయగా దుర్గారావు సీతయ్యలకు తల పగిలి దెబ్బలు తగిలాయి ఈ విషయమై వారు గత రెండు రోజుల క్రితమే స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ పేరుతో ఎస్సై తాత్సారం చేస్తున్నట్లు బాదితులు పేర్కొన్నారు.ఇప్పటికైనా జిల్లా పోలీస్‌ బాస్‌ స్పందించి తక్షణమే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.
బాధితులు వస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం: ఎస్‌ఐ వెంకన్న
మండలంలో శాంతి భద్రతల కోసం ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ పని చేస్తుంది. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం.