నర్సింగ్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాలి : టీఎన్‌ఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ నర్సింగ్‌ సమితి (టీఎన్‌ఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎన్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్‌, అధ్యక్షులు కె.ధనుంజయలు బుధవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 1964లో వచ్చిన చట్ట ప్రకారం కౌన్సిల్‌కు ఎన్నికలు జరపాల్సి ఉన్నప్పటికీ గత 52 సంవత్సరాలలో ఒక్కసారి కూడా నిర్వహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పురుషులకు అవకాశం కల్పించాలి
ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో బీ.యస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. పురుషుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం నర్సింగ్‌ వృత్తిలో అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వారు గుర్తుచేశారు. వైద్య, ఫార్మసీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి కోర్సుల్లో లింగ భేదం లేకుండా అవకాశాలు కల్పిస్తూ నర్సింగ్‌ కళాశాలల్లో మాత్రం పురుషులకు అవకాశం కల్పించడం లేదని రిజ్వీ దృష్టికి తీసుకెళ్లారు.