ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే..?ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం ఓ పెద్ద సవాల్‌. మన చుట్టూ ఉన్న ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల వంటివి తినడం సర్వసాధారణమైపోయింది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలా మంది ఇలాంటి ఫుడ్‌కి అలవాటుపడిపోతున్నారు. కానీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. జంక్‌ ఫుడ్‌ బదులు పండ్లు, క్యారెట్ల వంటి కూరగాయలు తింటే ఎంతో మంచిది.
టైముకి తినడం, టైముకి పడుకోవడం ఎంత ముఖ్యమో… శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. వ్యాయామం చేస్తే శరీరంలో వృథాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీరంలోని వివిధ భాగాలు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే వ్యాయామం చెయ్యకపోతే… కొన్ని శరీర భాగాల్లో కొవ్వు అదనంగా పెరిగి… అనారోగ్యాలకు కారణమవుతాయి. నడక, పరుగు, స్విమ్మింగ్‌ ఇవన్నీ ఒత్తిడి పోగొట్టి ఫిట్‌ నెస్‌ పెంచుతాయి.
మనందరం బాగా కష్టపడతాం. కానీ సరిగా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకొని తెల్లారి ఆరుకే లేచిపోతున్నారు. రోజూ అదే సమయం కాకుండా వేర్వేరు టైమ్స్‌లో పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా బెటర్‌. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీటెక్కిపోతుంది. మతిమరపు మొదలవుతుంది. చిరాకు వస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి, షుగర్‌ వ్యాధి వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి. అన్నింటికీ చెక్‌ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి.
ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ పక్కన పెట్టి ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్స్‌ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాఖాహారులైతే ఆవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్‌, కమలాలు, దానిమ్మకాయలు లాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.
మనకు సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. వీటిలో మంచి రుచి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు… లాంటివి తప్పనిసరిగా వాడాలి.
శరీరానికి రాత్రంతా రెస్ట్‌ ఇస్తాం కాబట్టి తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే బాగా పనిచేస్తాయి. అందుకే ఉదయం లేచిన రెండు, మూడు గంటల్లో బ్రేక్‌ పాస్ట్‌ కాస్త ఎక్కువ తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి.
డ్రై ఫ్రూట్స్‌ రేటు ఎక్కువ కాబట్టి గింజలు, పప్పులు వంటివి తినాలి. అలాగే పల్లీలు, బఠాణీలు, శనగలు, బీన్స్‌, మొక్కజొన్న లాంటివి కాస్త ఎక్కువే తినవచ్చు. ఇవన్నీ మనల్ని ముసలితనం రాకుండా కాపాడేస్తాయి.
మన బాడీలో మంచికొవ్వు, చెడ్డ కొవ్వూ రెండూ ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైలు తింటే… చెడ్డ కొవ్వు గూడు కడుతుంది. అది చాలా ప్రమాదం. దాని వల్ల సర్వ రోగాలూ వస్తాయి. చర్మం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. షుగర్‌, బీపీ, హార్ట్‌ ఎటాక్‌ ఇలా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే మంచి ఆహారం తినాలి. ఎక్కువగా ఉడికించినవి తినాలి.
కొంతమంది పని రాక్షసుల్లా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్లకు తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో పని చెయ్యాలి. రోజులో మూడు నాలుగు గంటలు రిలాక్స్‌ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటిమాటికీ టెన్షన్‌ వద్దు. కూల్‌ కూల్‌ అనుకుంటూ మనసును తేలిక చేసుకోవాలి. టీవీల్లో మొబైళ్లలో కామెడీ సీన్ల వంటివి చూడాలి. దాంతో టెన్షన్లు కాస్త తగ్గుతాయి.
ఇళ్లలో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయటి నుంచీ వచ్చే గాలిలో ఆక్సిజన్‌ ఎక్కువ. అది మన మెదడుకి చాలా అవసరం. అది అందేలా చెయ్యాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంతవరకూ ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఆరోగ్యమే ఆరోగ్యం.