ఈ మధ్య కాలంలో పిల్లల కాపురాలలో తల్లిదండ్రుల జోక్యం బాగా పెరిగిపోతున్నది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని సలహాలు ఇస్తుంటారు. పిల్లలకు ఆలోచించుకునే అవకాశమే ఇవ్వరు. ఏమైనా అంటే ‘నువ్వు చిన్న పిల్లవి, నీకేమీ తెలియదు’ అని నోరు మూయించేస్తారు. పెండ్లి తర్వాత అమ్మాయి వేరే ఇంటికి వెళుతుంది. అక్కడ పరిస్థితులు, వ్యక్తులు అన్నీ వేరుగా ఉంటాయి. అమ్మాయి వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం ఇవ్వాలి. అలా కాకుండా చిన్న సమస్య వస్తే చాలు పిల్లల కాపురాల్లో కలగజేసుకునే తల్లి దండ్రుల వల్ల ఆ పిల్లల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో దానికి ఉదాహరణే ఈ వారం ఐద్వా అదాలత్…
సలేహకు ప్రస్తుతం 25 ఏండ్లు. ఐదేండ్ల కిందట పెండ్లి చేశారు. ఐదుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లెలు. దాంతో అందరూ గారాబంగా చూసుకునేవారు. ఇంట్లో ఏ పనీ చేయించే వారు కాదు. అలాంటి అమ్మాయికి పెండ్లి చేసి పంపించారు. అత్తగారి కుటుంబం పెద్దది. ఇంట్లో ఉండేది ఆమె, భర్త, అత్తగారు అయినప్పటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సలేహాకేమో ఎలాంటి పనీ రాదు. వంట అసలే తెలియదు. వంట వరకు అత్త చేసినా కనీసం వడ్డించడం కూడా రాదు. పుట్టింట్లో అల్లారుముద్దుగా సాగిన ఆమె జీవితం పెండ్లి తర్వాత పూర్తిగా మారిపోయింది. అప్పుడప్పుడు ఆడపడుచులు వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండేవారు.
సలేహకు ఏ పనీ చేయడం రాదని తెలిసి వాళ్ళే ఎవరు పని వారు చేసుకునే వారు. నెమ్మదిగా చిన్న చిన్న పనులు చేయడం నేర్చుకో అని చెప్పేవారు. కూరగాయలు కట్ చేయడం, బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఊడవడం లాంటివి నేర్పించే ప్రయత్నం చేసేవారు. అది ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో తల్లికి ఫోన్ చేసి ‘ఇక్కడ నాతో ఇంట్లో పనులు చేయిస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పింది. వెంటనే ఆమె వచ్చి సలేహను తీసుకువెళ్ళింది. భర్త పిలిచినా, అత్త పిలిచినా రాలేదు. అప్పటికి పెండ్లై ఆరు నెలలు మాత్రమే అవుతుంది. కోడలు ఇలా ఇల్లు వదలి వెళ్ళడం బాగోలేదని పెద్దవాళ్ళందరినీ పిలిచి పంచాయితీ పెట్టించారు.
‘పని చేయడం ఇబ్బందిగా వుంటే పనమ్మాయిని పెట్టుకుందాం’ అని చెప్పి భర్త తీసుకుని వెళ్ళాడు. చెప్పినట్లు గానే ఇంట్లో పనుల కోసం ఒక అమ్మాయిని పెట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ సలేహ తన అత్తగారింట్లో జరిగే ప్రతీది తల్లికి చెప్పాలి. ప్రతి రోజు కూతురికి ఫోన్ చేసి ‘మీ అత్తయ్య ఎలా ఉన్నారు, పని నేర్చుకోమని మళ్ళీ ఇబ్బంది పెడుతుందా, వంట ఎవరు చేస్తున్నారు, నీవు ఏం చేయకు. ఆమెతోనే వంట చేయించు. ఏదైనా ఎక్కువగా అంటే చెప్పు, నేను వచ్చి మాట్లాడతా’ అనేది. అంతే కాదు భర్తతో కూడా జాగ్రత్తగా ఉండమని, చెప్పిన మాట వినకపోతే దూరం పెట్టమని చెప్పేది.
అలా ఏడాది గడిచింది. సలేహకు వాళ్ళ అమ్మతోనే ఉండాలని ఉండేది. అదే విషయం తల్లికి చెప్పింది. ఆమె వెంటనే వెళ్ళి కూతురిని ఇంటికి తీసుకెళ్ళింది. అల్లుడిని కూడా అక్కడే ఉండమంది. దానికి అతను ఒప్పుకోలేదు. ‘నువ్వు ఇలా ప్రతి చిన్న విషయం మీ అమ్మతో చెప్పడం బాగోలేదు. రా ఇంటికి వెళ్దాం’ అంటే ‘నేను రాను’ అంటూ తల్లి దగ్గరే ఉండిపోయింది. ‘రాకపోతే నేను ఇంకో పెండ్లి చేసుకుంటాను’ అన్నాడు. దాంతో ఆమె ‘భార్య వుండగా ఇంకో పెండ్లి ఎలా చేసుకుంటావు’ అంటూ ఐద్వా అదాలత్ వద్దకు వచ్చింది. సలేహ తల్లితో పాటు మొత్తం 15 మంది వచ్చారు. మేము సలేహతో మాట్లాడి తన భర్త ఆరీఫ్‌కు ఫోన్ చేసి పిలిపించాము.
అతను మాట్లాడుతూ ‘నా భార్యకు ఒక్క పని రాదు. మేము ఇంట్లో ఉండేది ముగ్గురం. ఎంత పని ఉంటుంది. ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బంది అంటే పనమ్మాయిని పెట్టుకున్నాం. నాకు వచ్చే జీతం తక్కువ. అయినా ఆమెకు ఇబ్బంది లేకుండా ఉండాలని పనమ్మాయిని పెట్టించాను. వంట మా అమ్మనే చేస్తుంది. కూరగాయలు కట్ చేయడం కూడా ఆమె పెద్ద పనిలా ఫీల్ అవుతుంది. పెండ్లయి ఏడాది అవుతున్నా ఇంత వరకు నేర్చుకోలేదు. ఆమెకు నేర్చుకోవాలి అని ఉన్నా వాళ్ళ అమ్మ నేర్చుకోవద్దని చెబుతుంది. ప్రతి చిన్న విషయం వాళ్ళ అమ్మకు చెప్పి ఆమె చేయమంటే చేస్తుంది. లేకపోతే లేదు. మా అక్కచెల్లెలు వచ్చినా వారితో సరిగా మాట్లాడదు. నీవు వారితో మంచిగా మాట్లాడితే వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడే ఉంటారు, తర్వాత ఇబ్బంది పడాల్సింది నువ్వే’ అంటూ కూతురికి చెబుతుంది.
వాళ్ళు ఇక్కడకు వచ్చినా అన్నీ పనులు వాళ్ళే చేసుకుంటారు. నాతో ప్రేమగా కూడా వాళ్ళ అమ్మ చెప్పినప్పుడే ఉంటుంది. నన్ను వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండమంటుంది. ఈమె కోసం ఇంకా ఎంత వరకు సర్దుకు పోవాలో అర్థం కావడం లేదు. అందుకే నేను రెండో పెండ్లి చేసుకుంటాను అని చెప్పాను. మా దగ్గర అలా రెండో పెండ్లి చేసుకునే అవకాశం ఉంది. మా అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది నా బాధ్యత. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసకున్నాను’ అంటూ తన మాటలు ముగించాడు.
అంతా విన్న తర్వాత అర్థమయింది ఏంటంటే ఇక్కడ అసలు సమస్య భార్య, భర్తలది కాదు. వాళ్ళ అమ్మ. ప్రతి తల్లి ఉన్నంతలో తన కూతురిని బాగానే చూసుకుంటుంది. పెండ్లి తర్వాత కూడా కూతురు అలాగే ఉండాలి అంటే అది కష్టం. దానిని ప్రతి తల్లి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇద్దరి మధ్య తల్లి జోక్యం మొదట తగ్గించాలని సలేహా తల్లిని పిలిచి ‘మీరు మీ కూతురి కాపురంలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. తల్లిగా బాధ్యతగా ఉండాలి. కానీ అది వారి కాపురానికి నష్టం కలిగించేలా ఉండకూడదు. ఆమెను సొంతగా ఆలోచించుకోనివ్వాలి. అక్కడ పరిస్థితులకు అలవాటు పడనివ్వాలి. మరీ అక్కడ కష్టాలు పడుతుంటే మీరు కల్పించుకోవచ్చు. కానీ మీరు చెప్పిన దాంట్లో కానీ, వాళ్ళు చెప్పిన దాంట్లో కానీ పెద్దగా సమస్యలేమీ లేవు. మీరు వాళ్ళ విషయం లో కలగ జేసుకోవడం కాస్త తగ్గిస్తే సరిపోతుంది. భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి అప్రేమ ఉంది. కానీ పంతాలకు పోయి కష్టాలు తెచ్చుకుంటున్నారు. సలేహా తనతో రానందని కోపంతో అతను రెండో పెండ్లి చేసుకుంటానన్నాడు కానీ అతనికి నిజంగా అలాంటి ఆలోచన లేదు. అతనికి లేని ఆలోచన మీరే కల్పించారు’ అన్నారు.
అలాగే సలేహాతో మాట్లాడుతూ ‘పెండ్లయి ఇన్ని రోజులైనా ఇంకా పని నేర్చుకోక పోవడం సరైనది కాదు. అవసరానికి తగ్గట్టు అన్ని పనులు నేర్చుకోవాలి. రేపు పిల్లలు పుడతారు. అప్పుడు తల్లిగా నీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఏదైనా నేర్చుకుంటే వస్తుంది, అయితే కొంత సమయం పడుతుంది. పెండ్లి తర్వాత అత్తగారి ఇల్లే నీ ఇల్లు. పైగా వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారు. అనవసరంగా నీ ప్రవర్తనతో మంచి కుటుంబాన్ని దూరం చేసుకోకు. అమ్మ జీవితంలో అవసరమే అలాగే పెండ్లి తర్వాత, భర్త అతని కుటుంబం కూడా చాలా అవసరం. రేపు మీ అన్నలకు పెండ్లి అవుతుంది. వదినలు వస్తారు. వాళ్ళ ముందు నువ్వు ఇలా పుట్టింట్లో ఉంటే ఏమనుకుంటారు. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నీవు నీ భర్తతో ఉండడం మంచిది. నీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు చెప్పు, మేము నీ భర్త, అత్తగార్లతో మాట్లాడతాం. అంతే కానీ మీ అమ్మకు ప్రతి చిన్న విషయాన్ని చెప్పకు’ అన్నారు.
ఆరీఫ్‌తో ‘ఏ కమ్యూనిటీలోనైనా మొదటి భార్య ఉండగా రెండో పెండ్లి చేసుకుంటే కేసు అవుతుంది. మొదటి భార్య అనుమతి ఇస్తేనే మీకు రెండో పెండ్లి చేసుకునే అవకాశం ఉంది. అంతేగానీ ఆమె అనుమతి లేకుండా చేసుకుంటే మీకే నష్టం. ఇంట్లో పనులు నెమ్మదిగా నేర్చుకుంటుంది. అందులో మీరు ఆమెకు సహాయం చేయండి. మీ అత్తరి జోక్యం మేము తగ్గిస్తాం’ అని చెప్పాము. దానికి అందరూ అంగీకరించి వెళ్లారు.
– వై. వరలక్ష్మి, 9948794051