ఉన్నత పాఠశాలలకు అదనపు నిధులివ్వాలి : టీఎస్‌జీహెచ్‌ఎంఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యావ్యవస్థ పాలనలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) సూచించింది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలకు అదనపు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు మంగళవారం టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం మెయిల్‌ ద్వారా లేఖ రాశారు. ఆర్‌ఎంఎస్‌ఏ, టీచర్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌ఎస్‌ఏ సమ్మిళితమై సమగ్ర శిక్షగా ఏర్పడిన తర్వాత ఎస్‌ఎండీసీలు రద్దయ్యాయని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లోని తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్‌ఎంసీల్లో భాగస్వామ్యం లేదని పేర్కొన్నారు. గతంలో ఎస్‌ఎండీసీల ద్వారా ఉన్నత పాఠశాలలకు అందిన గ్రాంట్లను నిలిపేశారని వివరించారు.
దానికి బదులుగా అదనపు నిధులను అందించాలని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల కాలపరిమితిని ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అయితే అమల్లో వస్తున్న సందేహాలకు, సాంకేతిక ఇబ్బందులకు వివరణ ఇవ్వాలని కోరారు. ఎస్‌ఎంసీ సభ్యులు, వైస్‌ చైర్మెన్‌, చైర్మెన్‌ నియామకం లేదా ఎంపిక సభ్యత్వం, పదవీకాలం పూర్తి కావడం లేదా రద్దు చేయడానికి సంబంధించిన నియమావళిని సవరించాలని విజ్ఞప్తి చేశారు.