ట్విన్స్‌!

Twins!ట్విన్సంటే కవలలనే కాదు
ఏక కాలంలో వరించిన రెండు విజయాలు
ఇవి జూన్‌ ఒకటిన మా ఇంట్లో గృహ ప్రవేశం చేసినవి!
ఇవ్వాళ అవి ఉయ్యాలల్లో ఊరేగడానికి ఉవ్విళ్ళూరుతున్నవి
మేం దేనికీ ఎదురు చూడకుండానే
ఆకాశంలో సగమొకరు మిగతా సగం మరొకరు!
జననమే ఉద్వేగభరితమైతే వీరి రాక మరింత ఉద్విగ భరితం!
వాళ్ళొచ్చిన వేళా విశేషమేమో కాని ఇప్పటి దాకా మా ఇంటి తలుపులు మూసుకోలేదు!
పగలంతా సందర్శకుల హేళ రాత్రయిందా విడతల వారీగా వీరిద్దరి గోల!
మా ఇంటికి నిద్ర కరువై మూడు నెలలైంది
వారు దయ తలచి పవళించందే ఇంట్లో నిశ్శబ్దం పరిమళించదు!
మొక్క నాటి నీళ్ళుపోసిన తోట మాలికి తోటంతా పూల వనమైనప్పుడు
కలిగే పరవశమే మా పిల్లల ముఖాలల్లో
ఒక తరం మరో తరాన్ని తోసుకుంటూ ముందుకు పోతుంటే
వృద్ధాప్యం ఒకింత వెక్కిరింతకు గురి కావచ్చు కాని
ఆ ఆనందాన్ని ఏ తాత కవిత్వమూ వ్యక్తీకరించ లేదు!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261