దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా దేవుడి పేరుతో జరిగే అరాచకం మాత్రం ఆగడం లేదు. సంస్కృతి, సాంప్రదాయాల పేరిట జోగినీ వ్యవస్థను కొనసాగిస్తు న్నారు. ఊరడమ్మ, పోచమ్మ పండుగ లంటూ ఈ హైటెక్ యుగంలోనూ జోగినీలతో నాట్యం చేయిస్తూ, వేపకొమ్మలతో అలంకరించి ఊరేగిస్తున్నారు. అయినా ఎవరూ నోరు తెరిచి ఈ సాంఘిక దురాచారాన్ని వ్యతిరేకించరు. అగ్ర వర్గాల ఆనందం కోసం బడుగు బలహీనలు మౌనంగా వీటిని భరించాల్సి వస్తుంది. అలాంటి జోగినీల దుర్భరమైన జీవితాల గురించి నేటి మానవిలో…
తరతరాలుగా రాజులు, జమీందార్ల ఏలుబడిలో గుడుల్లో మహిళలు దుర్భరమైన జీవితాన్ని అనుభవించారు. నిరుపేద దళిత యువతులను జోగినిగానో, దేవదాసిగానో, మాతంగిగానో మార్చేవారు. సాంప్రదాయాల పేరుతో దేవుని బిడ్డగా ప్రచారం చేసి వారి శరీరాలతో ఆటలాడారు. రాజుల కాలం, గడుల కాలం పోయినా నేటికీ అలాంటి ఆకృత్యాలను మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. బలవంతంగా జోగినిగా మార్చేసిన మహిళను ఆధిపత్య కులాల్లోని ప్రతి ఒక్కరూ లైంగికంగా వాడుకుంటున్నారు. ఇక జీవితాంత ఆమె వారి అకృత్యాలకు భరించాల్సిందే.
ఆమెను గుడికి సంబంధించిన దానిగా ‘గుడిచేటి’ అని అనే పేరుతో పిలుస్తుంటారు. సాలెగూడులో చిక్కుకున్నట్లు ఆ జోగిని ఎటూ తప్పించుకోలేని స్థితిలో, దారుణమైన మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తినడానికి తిండిలేక ఇల్లిల్లు తిరిగి అడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పటికీ వారి పరిస్థితులలో ఎలాంటి మార్పు రాలేదు. జోగినిలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. పేర్లేమైనా పెత్తందార్లు వాళ్ళను ఉపయోగించుకునే తీరు ఒక్కటే. దేవుడి పేరుతో, గుడి పేరుతో జరిగిన, జరుగుతున్న దౌర్జన్యాలకు ఉదాహరణ ఇది. బసవి, మాతంగి, దేవదాసి వ్యవస్థలు వాస్తవానికి 1988లో రద్దయ్యాయి. ప్రముఖ కవి గుర్రం జాషువా కూతురు హేమలత లవణం చేసిన పోరాట ఫలితంగా ఈ దురాచారాలు అధికారికంగా రద్దయ్యాయి. అయినా సాంప్రదాయం పేరుతో ప్రభుత్వాలు సైతం వాటిని ప్రోత్సాహిస్తూనే ఉన్నారు.
మూఢ నమ్మకమే ఆచారంగా….
ఈ ఆధునిక యుగంలో కూడా చాలా గ్రామాల్లో మూఢ నమ్మకాలతో జనం మోసపోతున్నారు. నిరక్షరాస్యులయిన అమాయక ప్రజల అవసరాను అవకాశంగా తీసుకుని పిల్లలు పుట్టడం లేదనో, కలిగినా, పుట్టిన వెంటనే చనిపోతున్నారని.. లేదా ఇంట్లో వారికి ఏదో జబ్బు వచ్చిందని.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు. సందర్భం ఏమైనా కావొచ్చు, ఈ వ్యవస్థ మాత్రం మూఢ విశ్వాసంలోంచి మొలకెత్తిందే. మరో వైపు దైవార్పితం అనే మరో అంధ విశ్వాసాన్ని బలపరుస్తూ, ఒక అమ్మాయిని ఊరికి ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు మనసులో ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవతల్ని తలుచుకుని, తమ కూతుర్ని జోగినిగా మారుస్తారు. అలా ఆ దేవత పేరుమీద ముడుపులు కడతారు. మనకు ఉన్న వేల వేల మూఢ విశ్వాసాల్లో ఇదీ ఒకటి. ఆ తర్వాత వారి జీవితాలు మెరుగుపడితే ఆ తల్లి కటాక్షమని సంతోషపడతారు. లేదంటే ఆ తల్లి మనసు ఇంకా కరగలేదని ఓపిక పడతారు.
జోగినిగా మార్చిన తర్వాత…
ఆ ఊరిపెద్దగానీ, పోతురాజు గానీ లేదంటే ఆ అమ్మాయికి బావ వరుస అయిన వ్యక్తిగాని ఆమె మెడలో తాళి కడతాడు. దానితో మైలపట్టం కార్యక్రమం పూర్తవుతుంది. ఇక అప్పటి నుండి ఊరి పెత్తందార్లు, భూ స్వాములు ఆమెను లైంగికంగా వాడుకుంటూ ఉంటారు. యవ్వనంలో ఉన్నంత వరకే ఏ మాతంగి, ఏ దేవదాసి, ఏ జోగిని జీవితమైనా తిండికి లోటు లేకుండా జరుగుతుంది. యవ్వనం తరిగిపోవడంతో వారికి కష్టాలు ప్రారంభమవుతాయి. దగ్గరికి వచ్చే వాళ్ళుండరు. తిండిపెట్టే వాళ్ళూ ఉండరు.
ఎన్నాళ్ళని భరిస్తారు
అందరూ దేవుడుని తండ్రితో సమానం అని అంటున్నారు. నిజమే దేవుడు తండ్రి అయితే ఆయనను పెండ్లి చేసుకున్న జోగిని తల్లి కాదా? మరి ఆమె ఊరి పెత్తందార్ల ఉమ్మడి సోత్తు ఎలా అయ్యిందీ? అవేవి పట్టించుకోకుండా వారి కోరిక తీర్చే వస్తువుగా ఆమెను భావిస్తారు. మతం, దేవుడు, గుళ్ళ, మనుస్మృతి ఆసరాతో శతాబ్దాలుగా మహిళల్ని మరబొమ్మలుగా చేస్తున్న ఈ వ్యవస్థల్ని ఇంకా ఎన్నాళ్లు భరిస్తారు? చివరి దశలో ఆ మహిళలు అంతులేని సుఖవ్యాధులతో దుర్భమైన చావులు చస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరు. వారు చనిపోయినా తర్వాత వారికి పుట్టిన బిడ్డల పరిస్థితి కూడా అంతే. లైంగిక హింసకు బలవుతూ బతికే ఇలాంటి జీవితాల గూర్చి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోరూ? మూఢ విశ్వాసాలను నివారించాల్సింది పోయి పాలకులే ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలను బలితీసుకుంటున్న ఇలాంటి అంధవిశ్వాసాలపై కలిసికట్టుగా ఉద్యమించాలి.
రఘునాథ కమిషన్ ద్వారా…
ప్రభుత్వం నియమించిన రఘునాథ కమిషన్ ద్వారా ఈ సాంఘిక దురాచారమైన జోగిని వ్యవస్థను రూపుమాపాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. 1992లో ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా హేమలత లవణం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు .దాంతో ప్రభుత్వం ఈ దురాచారాన్ని నిలిపివేసి జోగినిలకు భూములు, గేదెలు ఇచ్చి ఉపాధి కల్పించింది .అయినా కుల పెద్దలు, పెత్తందారులు వారిని ఉపాధి చేసుకోనీయకుండా భూములను తక్కువ ధరలకు తీసుకొని వేశ్యా వృత్తిని కొనసాగేలా చేశారు. దీంతో గంగాధర్ ప్రభుత్వం ఈ దురాచారంపై దృష్టి సారించి నిషేధించాలని కోరారు. వారికి సమాజంలో సమాన హక్కులు, కనీస గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రఘునాథ కమిషన్ అమలు చేయడం ద్వారా ఈ దురాచారాన్ని పూర్తిగా రూపుమాపేలా చేయవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటికీ జిల్లాలో పలు ప్రాంతాలలో ఈ జోగిని దురాచారం కొనసాగించడం దురదృష్ట కరమన్నారు. కావున ప్రభుత్వం ఈ సాంఘిక దురాచారం నుండి వారిని విముక్తి చేయాలని కోరారు.
– లింబూరి.లక్ష్మణ్
బోధన్